logo

పాతబస్తీలో ‘ఈద్‌-అల్‌-అదా’ సందడి

పాతబస్తీలో ‘ఈద్‌-అల్‌-అదా’ (బక్రీద్‌) సందడి ఊపందుకుంది. త్యాగానికి మారుపేరుగా నిలిచే పండగను సోమవారం జరుపుకోవడానికి ముస్లింలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Published : 16 Jun 2024 02:56 IST

జోరందుకున్న జీవాల విక్రయాలు

ఫలక్‌నుమా వద్ద కర్ణాటక నుంచి తెచ్చిన పొట్టేళ్ల కొనుగోలు 

న్యూస్‌టుడే, కేశవగిరి: పాతబస్తీలో ‘ఈద్‌-అల్‌-అదా’ (బక్రీద్‌) సందడి ఊపందుకుంది. త్యాగానికి మారుపేరుగా నిలిచే పండగను సోమవారం జరుపుకోవడానికి ముస్లింలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో ప్రధానమైన ‘ఖుర్భానీ’ కోసం పాతబస్తీతో పాటు శివార్లలో వేల సంఖ్యలో జీవాలు విక్రయిస్తున్నారు. పండగ సమీపిస్తుండడంతో వాటి అమ్మకాలు జోరందుకున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి జీవాలను ప్రత్యేకంగా ఇక్కడికి తెచ్చి విక్రయిస్తున్నారు. మరోవైపు ‘ధుల్‌ హిజ్జాహ్‌’ ఉపవాసదీక్షలు భక్తిప్రపత్తులతో నిర్వహిస్తున్నారు. చాలా మంది ‘హజ్‌’ కోసం బయలుదేరి వెళ్లారు. ఈద్‌ ప్రత్యేక ప్రార్థనల కోసం ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి.

‘ధుల్‌ హిజ్జాహ్‌’ ఉపవాసదీక్షలు.. రంజాన్‌ తరహాలోనే నెలవంక దర్శనంతో బక్రీద్‌ పండగలోనూ ఉపవాస దీక్షలు చేపడతారు. ఈ రోజాలను ‘ధుల్‌ హిజ్జాహ్‌’ అంటారు. ఈ నెల 7న నెల వంక దర్శనంతో రోజాలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు ఉపవాసదీక్షలను చేపట్టి 11వ రోజు పండగ నాడు ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఖుర్భానీ కార్యక్రమం చేపడతారు. కొందరు 10 రోజాలను పాటిస్తే.. మరికొందరు 9, 10వ రోజు ఉపవాసదీక్షలను చేపడతారు. ఉదయం సహరీ, సాయంత్రం ఇఫ్తార్‌ సమయాలను ఈ ఉపవాసదీక్షల కోసం ముందే ప్రకటిస్తారు. వీటి ఆధారంగానే దీక్షలు కొనసాగుతాయి. ఖుర్భానీ చేసే వారు పదిరోజుల పాటు క్షవరం, హెయిర్‌ కటింగ్‌ చేయించుకోకుండా, గోళ్లుసైతం తీయకుండా నిష్ఠగా ఉంటారు. ఖుర్భానీ చేసిన జీవాల మాంసాన్ని చిన్న చిన్న కవర్లలో ప్యాక్‌ చేసి బంధువులు, పేదలకు పంపిణీ చేయడం ఆనవాయితీ.

పాత బస్తీలో... ఇక్కడ ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చిన జీవాలను విక్రయిస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌ తదితర రాష్ట్రాల నుంచి గొర్రె పొట్టేళ్లు, మేకపోతులు ఇక్కడికి తీసుకొచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని