logo

బాలికల భద్రతకు ‘భరోసా’

సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న లింగ వివక్ష, హింస, వేధింపులను బాల్య దశ నుంచే అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో బాలికా సాధికారత క్లబ్‌ (కమిటీలు) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

Updated : 16 Jun 2024 05:08 IST

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సాధికారత కమిటీల ఏర్పాటు

విద్యార్థుల అవగాహన ర్యాలీ

న్యూస్‌టుడే, వికారాబాద్‌: సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న లింగ వివక్ష, హింస, వేధింపులను బాల్య దశ నుంచే అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో బాలికా సాధికారత క్లబ్‌ (కమిటీలు) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం, అప్రమత్తంగా ఉండటం, ఆపదలో స్పందించాల్సిన తీరుపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

పోలీసు, విద్యాశాఖల ఆధ్వర్యంలో..

విద్యాశాఖ, పోలీసు శాఖల సమన్వయంతో బాలికా సాధికారత కమిటీలు పని చేస్తాయి. ఇందులో ప్రతి తరగతి నుంచి ఇద్దరు చురుకైన అమ్మాయిలు సభ్యులుగా ఉంటారు. వీరే పాఠశాల బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఛైర్మన్‌గా, ఒక ఉపాధ్యాయురాలు మెంబర్‌ కన్వీనర్‌గా, షీ టీమ్‌ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. క్లిష్ట పరిస్థితులనూ ధైర్యంగా ఎదుర్కొనేలా, జీవితంలో విజయం సాధించేలా బాలికలను దిద్దటమే లక్ష్యంగా ఈ సాధికారత కమిటీలు పని చేస్తాయి. సమాజంలో మహిళలు ముఖ్యంగా బాలికలపై ఎలాంటి అమానుష ఘటనలు జరుగుతున్నాయో వీరికి వివరిస్తారు. అలాంటి వారిని ఎదుర్కోవాలంటే కేవలం ఒక్కరి వల్లకాదు. మానసిక ధైర్యానికి తోడు చట్టం అండగా నిలవాలి. ఆ నమ్మకాన్ని కలిగించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారు.  

చేపట్టే కార్యక్రమాలివే..

జిల్లాలో పరిగి, తాండూరు, కొడంగల్, వికారాబాద్‌ నియోజకవర్గాలుండగా ఒకటి నుంచి పదో తరగతి వరకు దాదాపు లక్ష మంది విద్యార్థులుండగా వీరిలో సగానికి దగ్గరగా బాలికలున్నారు. ఈ కమిటీల ఏర్పాటు మొదలు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.

  • డయల్‌ 100, 1098, 181, 112 వంటి సహాయవాణి టోల్‌ ఫ్రీ నంబర్లను పాఠశాలల్లో ప్రదర్శిస్తారు.
  • బాలికల్లో ఎదుగుదలతో పాటు వచ్చే మార్పులు, శారీరక ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత పరిశుభ్రత ఆవశ్యకత, జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తారు. బాలికల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహచరుల ఒత్తిళ్లకు ‘నో’ చెప్పడం తదితరాలను వివరిస్తారు. బాల్య వివాహాలు, హింస వంటి సమస్యలపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రతినిధులతో అవగాహన కార్యక్రమాలు, లైంగిక దాడులు అడ్డుకోవడంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారు.ప్రధానంగా బాలికలు మానసికంగా ధైర్యంగా ఎదిగేందుకు శిక్షణ ఇస్తారు.

ధైర్యంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతాం
రేణుకాదేవి, జిల్లా విద్యాధికారిణి

అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, మోడల్‌ స్కూల్స్, కస్తూర్బా విద్యాలయాల్లో బాలికల సాధికారత క్లబ్‌ (కమిటీ)ల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేశాం. బాలికలు ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ధైర్యంగా ఎదుర్కొనేలా సిద్ధం చేస్తాం. బాలికలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఈ దిశగా పాఠశాలలు, కుటుంబాలతో పాటు సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని