logo

జులై 7 నుంచి 29 వరకు బోనాలు

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ మరింత ఇనుమడించేలా ఆషాఢ బోనాలు నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు స్పష్టం చేశారు.

Published : 16 Jun 2024 03:34 IST

ఏర్పాట్లకు త్వరలో రూ.25 కోట్లు విడుదల

సమీక్షలో హనుమంతరావు, శ్రీలతారెడ్డి, శైలజారామయ్యర్, మంత్రి సురేఖ, విజయలక్ష్మి, అనికుమార్, నాగేందర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ మరింత ఇనుమడించేలా ఆషాఢ బోనాలు నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు స్పష్టం చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీహెచ్‌ఆర్డీ)లో బోనాల ఉత్సవాల సన్నాహాలపై శనివారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి  మాట్లాడుతూ ‘వచ్చే నెల 7 నుంచి 29 వరకు వైభవంగా ఉత్సవాలు నిర్వహించాలి.  హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోని మూడు వేలకుపైగా దేవాలయాలను శోభాయమానంగా అలంకరించాలి. ఉత్సవాల నిర్వహణకు రూ.25  కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరాం. రెండు మూడు రోజుల్లో నిధులు విడుదలవుతాయి. ఆ వెంటనే దేవాలయాల అలంకరణ, సౌకర్యాల కల్పన పనులు చేపట్టాలి.   అంబారీపై ఊరేగించేందుకు కర్ణాటక నుంచి ఏనుగును తెప్పిస్తున్నాం. వర్షాకాలం కావటంతో విపత్తు నిర్వహణ విభాగం అప్రమత్తంగా ఉండాలి. ఆయా దేవాలయాల్లో ఉత్స వాల సమాచారంతో క్యాలెండరును విడుదల చేస్తాం’ అని తెలిపారు.  

పట్టు వస్త్రాల సమర్పణ

బోనాల సందర్భంగా 28 దేవాలయాల్లో ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించాలని నిర్ణయించాం. వచ్చే నెల 21న సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించిన మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు రంగం ఉంటుంది. జులై 29న అక్కన్న మాదన్న దేవాలయంలో అంబారీపై ఊరేగింపు ఉత్సవం అనంతరం ఘటాల ఊరేగింపు, నిమజ్జనంతో బోనాల జాతర ముగుస్తుంది’ అని మంత్రి సురేఖ వివరించారు. ‘ఈ దఫా ఉత్సవాలను ఘనంగా పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, గ్రేటర్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతారెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, కమిషనర్‌ హనుమంతరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని