logo

ఒకరు దేశ సేవలో.. మరొకరు ఐటీ రంగంలో

ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు దేశ సేవలో.. మరొకరు ఐటీ సేవల్లో. దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శనివారం జరిగిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ అనంతరం క్యాడెట్స్‌ వారి తల్లిదండ్రులతో మాట కలిపినప్పుడు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

Updated : 16 Jun 2024 05:05 IST

దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో క్యాడెట్ల మనోగతం
ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, దుండిగల్‌

ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు దేశ సేవలో.. మరొకరు ఐటీ సేవల్లో. దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శనివారం జరిగిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ అనంతరం క్యాడెట్స్‌ వారి తల్లిదండ్రులతో మాట కలిపినప్పుడు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశ సేవలో రెండో తరం, మూడో తరం కూడా ప్రవేశించడం విశేషం. 


అమ్మాయి ఇష్టప్రకారమే చేరింది..  
- ఫ్ల్లయింగ్‌ ఆఫీసర్‌ హినాగుప్తా తండ్రి రాజ్‌కుమార్‌ గుప్తా 

నేను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నా. అబ్బాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అమ్మాయి ఇప్పుడు ఎయిర్‌ఫోర్స్‌లో చేరింది. ఇది ఆమె ఇష్టమే. మా ఇంట్లో రెండో తరమూ దేశ సేవకు అంకితం అవుతున్నందుకు గర్వంగా ఉంది.


కఠోర శిక్షణ వల్ల మధ్యలో వదిలేద్దామనుకున్నా ..  
-కామర్తి విష్ణు, ఫ్ల్లయింగ్‌ ఆఫీసర్, తెలంగాణ  

మాది మహబూబ్‌నగర్‌ జిల్లా. నాన్న భారత వాయుసేనలో విధులు నిర్వహిస్తున్నారు. దుండిగల్‌కు వచ్చాక ఇక్కడ కేంద్రీయ విద్యాలయంలో తొమ్మిది వరకు చదివా. తర్వాత కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో చేరా. అక్కడి నుంచి నా గమ్యం మారిపోయింది. ఎన్‌డీఏకు ఎంపికయ్యేందుకు ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సహించారు. ఎన్‌డీఏకు ఎంపికై అక్కడ మూడేళ్ల కఠోర శిక్షణ అనంతరం కొద్దిమందిని ప్రత్యేక శిక్షణ కోసం ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్లకు పంపిస్తారు. అలా నాన్న విధులు నిర్వహించే దుండిగల్‌ స్టేషన్‌లో తదుపరి శిక్షణకు వచ్చా. ఎన్‌డీఏ, ఇక్కడ కలిపి నాలుగేళ్ల శిక్షణ చాలా కఠినమే. మధ్యలో  వదిలేయాలని అనిపించేది. ఎంతో శ్రమించి.. ఇప్పుడు వదిలేయకూడదని నాకు నేను చెప్పుకునేవాడిని. అలా విజయవంతంగా పూర్తి చేశాను.


తండ్రి అడుగు జాడల్లోనే..  
- నందిని సోరౌట్, ఫ్లయింగ్‌ ఆఫీసర్, భారత వాయుసేన

మాది హరియాణా. నాన్న డిఫెన్స్‌ రంగంలో పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. నాకు విమానాలంటే ఆసక్తి ఉండేది. దిల్లీలోని యూనివర్సిటీలో మ్యాథ్స్‌లో పీజీ చేశా. అథ్లెట్‌ను కూడా. భారత వాయుసేనలో చేరతానంటే ప్రోత్సహించారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేశా. ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌లో ప్రతిభ చూపి పతకం గెల్చుకున్నా.

ఎయిర్‌షోను తిలకిస్తున్న క్యాడెట్లు, వారి కుటుంబసభ్యులు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని