logo

సంపులోకి పంపించి.. నాలాలోకి తరలించి

రాజధానిలో చిన్నపాటి వర్షానికే చెరువుల్లా మారుతున్న రోడ్ల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపించబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో దీనిపై అధికారులు కార్యాచరణ రూపొందించారు.

Updated : 16 Jun 2024 05:00 IST

వర్షాలకు చెరువుల్లా మారుతున్న రోడ్లకు సరికొత్త పరిష్కారం
సీఏం ఆదేశాలతో కదిలిన అధికారులు

మెర్క్యురీ హాస్పిటల్‌ కూడలిలో నిలిచిన వరద

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధానిలో చిన్నపాటి వర్షానికే చెరువుల్లా మారుతున్న రోడ్ల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపించబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో దీనిపై అధికారులు కార్యాచరణ రూపొందించారు. నెల రోజుల వ్యవధిలో దీనికి సంబంధించిన పనులను పురపాలక శాఖ ఆధ్వర్యంలో బల్దియా అధికారులు మొదలు పెట్టి పూర్తి చేయబోతున్నారు. వర్షాలతో చెరువులుగా మారే ప్రాంతాల్లో దానికి సమాంతరంగా పెద్ద సంపు తవ్వి నీటిని అందులోకి మళ్లించే ఏర్పాటు చేయనున్నారు. ఈ సంప్‌ నుంచి నీటిని మోటార్లు ద్వారా సమీపంలోని అతిపెద్ద నాలాలకు తరలిస్తారు. 

ఇప్పటికే టెండర్లకు ఆహ్వానం

ఏకధాటిగా 2సెం.మీ.ల వర్షం పడితే చాలు దాదాపు 50చోట్ల చెరువుల్లా మారుతున్నాయి. ఇందులో 20 వరకు ప్రధాన ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలుస్తోంది. మొదటి దశలో 12 చోట్ల సంపులు నిర్మించాలని నిర్ణయించారు. పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఈ నెలాఖరుకే పనులు పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 


ఇలా చేస్తారు..

హైదరాబాద్‌ నుంచి శంషాబాద్‌ వెళ్లే మార్గంలో పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే కింది భాగంలో పిల్లర్‌ నంబర్‌ 264 శివరాంపల్లి దగ్గర భారీ వర్షం పడితే ఈ ప్రాంతం చెరువుగా మారుతోంది. రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా దీనికి సమీపంలోని ప్రభుత్వ స్థలంలో 1.50లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపును నిర్మించనున్నారు. ఈ నీటిని వెంటవెంటనే మోటార్ల ద్వారా బుల్కాపూర్‌ నాలాలోకి తరలిస్తారు.

  • హుస్సేన్‌సాగర్‌ చుట్టూ నీరు నిల్చే ప్రాంతాల్లోనూ ఇలాగే సంపుల నుంచి సాగర్‌లోకి పంపించనున్నారు.
  • రాజ్‌భవన్‌ రోడ్డులోని లేక్‌ క్యూ అతిథి గృహం దగ్గర సంపును తవ్వబోతున్నారు. మొదటి దశ పనులు పూర్తయిన తరువాత రెండో దశలో మరికొన్నిచోట్ల నిర్మించాలని నిర్ణయించారు.

పనులు వేగంగా పూర్తి చేస్తాం
- దానకిషోర్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం మేరకు నగరంలో వర్షంతో నిండిపోయే జంక్షన్లను గుర్తించి సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించాం. కొన్నిచోట్ల సంపుల నిర్మాణంతో పాటు మరికొన్నిచోట్ల ఈ ప్రాంతాలను ప్రధాన నాలాలకు అనుసంధానం చేయడం ద్వారా సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నెలలో పనులు మొదలుపెట్టి వచ్చే నెలా మధ్య నాటికి పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేశాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని