logo

ఇద్దరి కిడ్నాప్‌.. రక్షించిన పోలీసులు

ఆర్థిక వివాదాల నేపథ్యంలో గచ్చిబౌలిలో కిడ్నాప్‌ గురైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు వికారాబాద్‌లో రక్షించారు.

Published : 17 Jun 2024 01:33 IST

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: ఆర్థిక వివాదాల నేపథ్యంలో గచ్చిబౌలిలో కిడ్నాప్‌ గురైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు వికారాబాద్‌లో రక్షించారు. హైదరాబాద్‌ పరిధిలోని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లికి చెందిన చదలవాడ సాయి గుప్తా(35) కొంతకాలం క్రితం నగరానికి వలస వచ్చి కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. నిజాంపేట్‌లో నివాసం ఉంటున్న తన స్నేహితుడు కె.సతీష్‌ రెడ్డి(38)తో కలిసి గచ్చిబౌలిలోని పీఎస్‌ఆర్‌ ప్రైమ్‌ టవర్స్‌ భవనంలో కిక్‌ స్టార్ట్‌ కోవర్కింగ్‌ స్పేస్‌ కార్యాలయం నిర్వహిస్తున్నాడు. సాయి తనకు వరుసకు బావమరిదైన సత్తెనపల్లికి చెందిన భవిశెట్టి గౌతమ్‌ (35) వద్ద వడ్డీకి డబ్బు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బును అతడు మరొకరికి అధిక వడ్డీకి ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆర్థిక లావాదేవీల్లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇచ్చిన మొత్తానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కిడ్నాప్‌ చేసైనా డాక్యుమెంట్లు రాయించుకోవాలని గౌతమ్‌ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆల్విన్‌ కాలనీలో ఉంటున్న సత్తెనపల్లికి చెందిన అన్నం అశోక్‌రెడ్డితో కలిసి జగద్గిరిగుట్టలో ఉండే కిరాయి ముఠా సాయంతో సాయిని కిడ్నాప్‌ చేసేందుకు ప్లాన్‌ చేశాడు. ఈ నెల 14న రాత్రి సాయిగుప్తా, సతీష్‌ రెడ్డిల కారును, మరో రెండు కార్లలో గౌతమ్‌తోపాటు మరో పదిమంది వెంబడించారు. హఫీజ్‌పేట వద్ద వారిద్దరిని కొట్టి బలవంతంగా జగద్గిరిగుట్టలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, డాక్యుమెంట్లపై సంతకం చేయాలంటూ చితకబాదారు. అదే రాత్రి వికారాబాద్‌లోని వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకెళ్లి బంధించారు. సాయి గుప్తా భార్య తులసి శనివారం ఉదయం తన భర్త కనిపించడం లేదంటూ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వికారాబాద్‌లో బాధితులను గుర్తించారు. విషయం తెలిసి బాధితులను వదిలి పారిపోయిన ప్రధాన నిందితులు గౌతమ్, అశోక్‌ రెడ్డిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగతా పది మంది పరారీలో ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని