logo

కొట్టేసి.. నల్ల కాగితాలను కరెన్సీగా మార్చేసి

ఒక చాక్లెట్‌ కంపెనీ యజమాని ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం ఉందన్న వదంతుల్ని నమ్మారు. దోపిడీ చేసి డబ్బు కొట్టేశాక ఆ స్ధానంలో నల్లరంగులో ఉండే కాగితాలు ఉంచి క్షుద్రపూజలతో అసలైన కరెన్సీగా మార్చేద్దామనుకుని సిద్ధమయ్యారు.

Published : 17 Jun 2024 09:10 IST

ఈ నెల 10న ఆదిభట్లలో ఘటన.. 14 మంది అరెస్టు

ఈనాడు- హైదరాబాద్‌: ఒక చాక్లెట్‌ కంపెనీ యజమాని ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం ఉందన్న వదంతుల్ని నమ్మారు. దోపిడీ చేసి డబ్బు కొట్టేశాక ఆ స్ధానంలో నల్లరంగులో ఉండే కాగితాలు ఉంచి క్షుద్రపూజలతో అసలైన కరెన్సీగా మార్చేద్దామనుకుని సిద్ధమయ్యారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధి ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ నెల 10న అర్థరాత్రి ఈ ఘటనజరిగింది. దోపిడీకి యత్నించిన 14 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఒకరు పరారీలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, ఆదిభట్ల ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌రెడ్డితో కలిసి మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు. 

వ్యాపారంలో నష్టపోయి..: అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బోగిని జంగయ్య(52) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. ఇతనికి మన్సూరాబాద్‌కు చెందిన డ్రైవరు కె.శేఖర్‌రెడ్డి, ఇసుక వ్యాపారి ఎండీ మహమూద్‌తో స్నేహముంది. తుర్కయాంజల్‌ శ్రీరామ్‌నగర్‌లో నివాసముండే ఓ చాక్లెట్‌ కంపెనీ యజమాని తిరుమనతురై ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం ఉందని బోగిని జంగయ్యకు ఓ వ్యక్తి ద్వారా తెలిసింది. డబ్బు ఉందో లేదో తెలుసుకోవడానికి తాంత్రికుడితో పూజలు చేయించాలనుకున్నారు. పూజారి రాకపోవడంతో మేడ్చల్‌కు చెందిన పెద్ది శ్రీనివాస్‌కు చెప్పారు.రజాక్‌ ఆరా తీయగా చాక్లెట్‌ కంపెనీ యజమాని ఇంట్లో డబ్బున్న మాట వాస్తవమేనని తెలుసుకున్నాడు. రజాక్‌ బోయిన్‌పల్లికి చెందిన మటం సతీశ్‌(37)ను సంప్రదించాడు. సతీశ్, రజాక్‌ గతంలో రూ.5 లక్షలు మోసపోయారు. గతంలో మోసపోయిన డబ్బు తిరిగి సంపాదించుకోవచ్చని సలహా ఇచ్చాడు. జంగయ్య, శేఖర్‌రెడ్డి, మహమూద్, పెద్ద శ్రీనివాస్, రజాక్, సతీశ్‌లు తమకు తెలిసిన వ్యక్తులు నగరానికి చెందిన మార్కెటింగ్‌ ఉద్యోగి జాఖీ లఖానీ(39), మహ్మద్‌ ఆదిల్‌(24), సవూద్‌ హష్మి(25), సయ్యద్‌ ఇస్మాయిల్‌(24), రహీముల్లా ఖాన్‌(19), అక్బర్‌ ఖాన్‌(19), షమీముల్లా(24), మహ్మద్‌ ముదాసిర్‌(19)ను కూడగట్టారు. కొట్టేసిన సొమ్ములో వాటాలు పంచుకోవాలన్నది వీళ్ల ప్రణాళికగా పోలీసులు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని