logo

నగర సీసీఎస్‌ ప్రక్షాళన షురూ..!

నగర సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌) ప్రక్షాళన మొదలైంది. కీలకమైన విభాగంలో తాజాగా బయటపడుతున్న సిబ్బంది చేతివాటం, అక్రమార్కులతో చేతులు కలిపి సాగిస్తున్న దందాపై ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు.

Published : 17 Jun 2024 01:42 IST

12 మంది ఇన్‌స్పెక్టర్లపై బదిలీ వేటు
మరో నాలుగు పోలీస్‌స్టేషన్లపై గురి

ఈనాడు, హైదరాబాద్‌: నగర సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌) ప్రక్షాళన మొదలైంది. కీలకమైన విభాగంలో తాజాగా బయటపడుతున్న సిబ్బంది చేతివాటం, అక్రమార్కులతో చేతులు కలిపి సాగిస్తున్న దందాపై ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. అక్కడ విధుల్లో ఉన్న 12 మంది ఇన్‌స్పెక్టర్లు శివశంకర్, రఘుబాబు, అప్పలనాయుడు, రాజేశ్, సీతారాములు, హుస్సేన్, సత్యం, నాగేశ్వర్‌రెడ్డి, కృష్ణ, సత్యనారాయణ, ఇమ్మానుయేల్, క్రాంతికుమార్‌లను ఒకేసారి బదిలీ (మల్టీజోన్‌2కు సరెండర్‌)చేస్తూ నగర సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరో నలుగురు ఎస్సైలపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. శాంతిభద్రతల నిర్వహణ, ఆర్ధికనేరాల కట్టడిలో కీలకమైన సీసీఎస్‌ విభాగం అవినీతి మయంగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపంతో కొందరు సిబ్బంది నిందితులకు సహకరిస్తూ రాజీ పేరిట పెద్దఎత్తున వసూళ్లు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే గత నెల 21న సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో అనిశా అధికారులు తనిఖీలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు గుర్తించి అరెస్ట్‌ చేశారు. తాజాగా కేసు రాజీ చేస్తానంటూ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ రూ.3లక్షలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావటంతో అనిశా దర్యాప్తు చేపట్టింది. వరుస ఘటనలతో మసకబారిన సీసీఎస్‌ ప్రతిష్టను కాపాడేందుకు దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని