logo

పట్టుకోవాల్సిన వారే పట్టుబడిపోతున్నారు..!

నగర సీసీఎస్‌లో పెచ్చుమీరిన అవినీతి ఉన్నతాధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసుకో రేటుకట్టి వసూళ్ల దందా సాగిస్తున్న సిబ్బందిని దారికి తీసుకురావటం సవాల్‌గా మారింది.

Published : 17 Jun 2024 01:44 IST

సిబ్బంది నియామకంలోనే తప్పటడుగులు
ఈనాడు, హైదరాబాద్‌ 

గర సీసీఎస్‌లో పెచ్చుమీరిన అవినీతి ఉన్నతాధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసుకో రేటుకట్టి వసూళ్ల దందా సాగిస్తున్న సిబ్బందిని దారికి తీసుకురావటం సవాల్‌గా మారింది. అవినీతి నిరోధకశాఖ అక్కడ చేస్తున్న వరుస అరెస్ట్‌లు కలవరం కలిగిస్తోంది. వ్యాపార విస్తరణకు సలహా ఇస్తానంటూ రూ.లక్షల్లో మోసం చేశాడంటూ ఇచ్చిన బాధితుడి ఫిర్యాదుతో సీసీస్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ ఈ కేసు మాఫీ చేసేందుకు నిందితుడిని రూ.15లక్షలు డిమాండ్‌ చేశాడు. అడ్వాన్స్‌గా రూ.5లక్షలు తీసుకున్నాడు. మరో రూ.3లక్షలు లంచం తీసుకుంటూ గురువారం అనిశా అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. గత నెలలో సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో అనిశా అధికారులు సోదాలు జరిపారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు నిర్దారణ కావటంతో అరెస్ట్‌ చేశారు. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు పోలీసు అధికారులు అనిశాకు పట్టుబడ్డారు. సుధాకర్‌ను శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరిస్తే 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. 

ఉన్నతాధికారుల ప్రమేయంపై ఆరా: అనిశా అధికారులు శుక్రవారం ఉదయం సీసీఎస్‌లో సోదాలు నిర్వహించారు. సీసీఎస్‌ డీసీపీ శ్వేత, అర్ధిక నేరాల విభాగం ఏసీపీ రాంరెడ్డి నుంచి సమాచారం సేకరించారు. కేసు మాఫీ చేస్తానంటూ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ తనను రూ.15లక్షలు డిమాండ్‌ చేసినట్టు బాధితుడు అనిశా అధికారులకు తెలిపాడు. తనకిచ్చే సొమ్ములో కొంత తనపై అధికారులకు కూడా వాటా ఇవ్వాలంటూ చెప్పటంతో అడిగినంత ఇచ్చేందుకు అంగీకరించానంటూ బాధితులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల ప్రమేయంపై అనిశా అధికారులు ఆరా తీశారు. వారికి తెలియకుండా కేవలం నిందితుడిని భయపెట్టేందుకు ఆ పేర్లు వాడుకున్నట్టు అనిశా ఎదుట సుధాకర్‌ అంగీకరించినట్టు సమాచారం.


అక్రమార్కులదే హవా

షీర్‌బాగ్‌లోని సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌) ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన కేసులను ఛేదించింది. కరడుగట్టిన ఎంతోమంది ఆర్దికనేరస్థులను ఊచలు లెక్కబెట్టించింది. భూ కుంభకోణాలు, ప్రీలాంఛింగ్‌ మోసాలు, నోట్లమార్పిడి సమయంలో సాగించిన మోసాల వెనుక సూత్రధారులను వెతికి వెంటాడి మరీ అరెస్ట్‌ చేసి చరిత్ర ఇక్కడి అధికారుల సొంతం. అంతటి కీలకమైన విభాగాన్ని కొందరు ఉన్నతాధికారులు తమ సొంత ప్రయోజనాలకు వేదికగా మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి. ఒక భూ వివాదం కేసులో న్యాయం చేయమని అడిగిన బాధితులను ఒక ఏసీపీ చితకబాదినట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన ఇద్దరు ఏసీపీలు సాగించిన అవినీతి చిట్టా ఇప్పుడిప్పుడే వెలుగుచూస్తోంది. ఈ రెండు విభాగాల్లో నియమించే సిబ్బంది ఎంపిక ప్రక్రియ సర్వీస్‌ రికార్డు ఆధారంగా సమర్థతకే పట్టం కట్టేవారు. క్రమంగా పైరవీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని