logo

ధార్‌ గ్యాంగ్‌.. మళ్లీ వచ్చేసింది

రాజధానిపై అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా కన్నుపడింది. ఓవైపు స్థానిక దొంగలు ఎక్కడికక్కడ ఇళ్లను గుల్ల చేస్తుంటే.. ఇతర రాష్ట్రాలకు చెందిన కిరాతక ముఠాల కదలికలు నగరంలో అలజడి రేపుతున్నాయి.

Updated : 17 Jun 2024 08:19 IST

చాలా ఏళ్ల తర్వాత హల్‌చల్‌
రాజధానిలో వరుస దొంగతనాలు

ఈనాడు- హైదరాబాద్‌: రాజధానిపై అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా కన్నుపడింది. ఓవైపు స్థానిక దొంగలు ఎక్కడికక్కడ ఇళ్లను గుల్ల చేస్తుంటే.. ఇతర రాష్ట్రాలకు చెందిన కిరాతక ముఠాల కదలికలు నగరంలో అలజడి రేపుతున్నాయి. ఒకేసారి వరుసగా ఇళ్లల్లో చోరీ చేసి అవసరమైతే ప్రాణాలు తీసేందుకు వెనుకాడని దోపిడీ దొంగల సంచారం ఆందోళన పెంచుతోంది. తాజాగా నగర శివారు హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక గేటెడ్‌ కమ్యూనిటీలోని 5 ఇళ్లల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్‌ గ్యాంగ్‌ వరుస చోరీలకు తెగబడింది. దొంగలించిన సొమ్ము తక్కువ మొత్తంలోనే ఉన్నా.. దోపిడీల్లో ఆరితేరిన ముఠా చాలా ఏళ్ల తర్వాత నగరంలోకి ప్రవేశించడంతో కలకలం రేపుతోంది.

రెండేళ్ల తర్వాత అలజడి: నగర పోలీసుల గట్టి నిఘా.. వరుస అరెస్టులతో మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్‌ గ్యాంగ్‌ రెండేళ్లుగా నగరంవైపు చూడలేదు. చివరిసారిగా 2022 ప్రథమార్థంలో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ ముఠా దొంగతనాలు చేసింది. ధార్‌ ముఠా సభ్యుల మీద 2018- 2022 మధ్య సైబరాబాద్‌లో 138, రాచకొండలో 32 చోరీ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా శివారు ప్రాంతాలు, దూరంగా విసిరేసినట్లు ఉండే కాలనీలోని ఇళ్లల్లో దొంగతనాలు చేస్తుంటారు. పగటిపూట కాలనీల్లో రెక్కీ చేసి అర్థరాత్రి దొంగతనం చేసే ముఠాలు ఒక్కోసారి దాడులు, హత్య చేసేందుకు వెనుకాడరని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ముఠా ప్రధాన నాయకుల్ని 2022లో సైబరాబాద్, రాచకొండ పోలీసులు వరుసగా అరెస్టు చేశారు. మాన్‌సింగ్, ఇతరుల మీద పీడీ యాక్టులు ప్రయోగించడం, ఇతరుల్ని పట్టుకొచ్చి జైలుకు పంపడంతో రెండేళ్లు ఇటువైపు రావడం మానేశారు. 

కొత్త రూపాల్లో..: అపార్టుమెంట్లు, కాలనీల్లో భద్రతా సిబ్బంది నియామకం, సీసీ కెమెరాలు, పోలీసు పెట్రోలింగ్‌తో స్థానిక దొంగలు కొత్త పంథాలో చోరీలు చేస్తున్నారు. ఇంటి పని, ఇతర అవసరాల పేరుతో పట్టపగలు ఇంట్లోకి వచ్చి ఎవరూ లేకపోతే దోపిడీలు చేస్తున్నారు. మహిళలు, వికలాంగులుగా నటిస్తూ చోరీలు చేస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని