logo

అనుమతుల్లోనే లోపం పర్యవేక్షణ శూన్యం

ప్రమాదకరంగా విద్యుత్తు తీగలకు అతి సమీపంగా నగరంలో పలుచోట్ల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిగా కడుతున్నారు.

Published : 17 Jun 2024 01:57 IST

శివార్లలో కరెంట్‌ తీగలకు తాకేలా కట్టడాలు
ఈనాడు, హైదరాబాద్‌

ప్రమాదకరంగా విద్యుత్తు తీగలకు అతి సమీపంగా నగరంలో పలుచోట్ల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిగా కడుతున్నారు. గతంలో ఇళ్లపైన కరెంట్‌ తీగలు తాకి పలువురు చనిపోయిన సంఘటనలు జరిగినా.. ఇంటి యాజమానులు మాకేం కాదులే అన్నట్లుగా అంతస్తులు నిర్మిస్తున్నారు. డిస్కం పెద్దగా అభ్యంతర పెట్టడం లేదు. పైగా కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది దీన్ని ఆసరాగా చేసుకుని పబ్బం గడుపుకుంటున్నారు.

అంచనాలకే పరిమితం..గతంలో నగరంలో చూపిన అలక్ష్యమే ఇప్పుడు శివార్లలో కనిపిస్తోంది. ప్రధాన నగరంలో ఇళ్లకు సమీపంలో విద్యుత్తు తీగలతో ఏటా పిల్లలు, పెద్దలు విద్యుదాఘాతాలకు గురైన సంఘటనలు జరుగుతుండేవి. ప్రమాద తీవ్రత దృష్ట్యా వీటిని తొలగించేందుకు గత ప్రభుత్వం ఆదేశాలతో ఆరేడు వందల కోట్ల రూపాయలు అవుతుందని అంచనా కూడా డిస్కం వేసింది. నిధులు మంజూరు కాక ఇప్పటికే ప్రమాదకరంగానే ఉన్నాయి. ఇప్పుడు శివార్లలోనూ ఇటువంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయి.

మీటరు దూరం వదలడం లేదు.. విద్యుత్తు తీగలకు నిర్ణీత దూరం పాటించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఇళ్లకు కరెంట్‌ సరఫరా చేసే ఎల్‌టీ తీగలకు కనీసం మీటర్‌ దూరంలో నిర్మాణాలు ఉండాలి. మరింత ఎక్కువ సామర్థ్యం కల్గిన కరెంట్‌ సరఫరా చేసే 11కేవీ/33కేవీ తీగలైతే కనీసం మీటర్నుర దూరం వదిలిపెట్టి నిర్మాణాలు చేసుకోవాలి. శివార్లలోని పలు విద్యుత్తు సెక్షన్ల పరిధిలో అత్యంత ప్రమాదకరంగా కరెంట్‌ స్తంభాలకు, తీగలకు తాకేలా భవనాలను నిర్మిస్తున్నారు. జీడిమెట్ల డివిజన్‌ పరిధిలో పలుచోట్ల ఈ తరహాలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణ సమయంలో పొరపాటున తీగలకు తాకితే ప్రాణాలే పోతాయి. వీటిని మొదట్లోనే డిస్కం అడ్డుకోవాల్సి ఉండగా వారే దగ్గర్నుండి కనెక్షన్లు ఇస్తున్నారు. అత్తాపూర్‌లో ఖాళీ స్థలంలో రేకులతో షెడ్‌ వేశారు. వాణిజ్య అవసరాలకు ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రాంగణంలో బిగించుకున్నారు ఈ తీగలకు సమీపంగా ఇనుపరాడ్‌లతో కూడా షెడ్‌ వేశారు. 

పద్ధతికి విరుద్ధంగా.. 

డిస్కంకు చెందిన విద్యుత్తు స్తంభాలకు అత్యంత సమీపంగా ఎవరైనా నిర్మాణాలు చేస్తుంటే జీహెచ్‌ఎంసీ, స్థానిక సంస్థలకు డిస్కం ఫిర్యాదు చేస్తే వారు చర్యలు తీసుకుంటారు. అనుమతులకు విరుద్ధంగా కడుతుంటే, అనుమతి లేకుండా కడితే కూల్చేస్తారు.

గతంలో సరఫరా నిలిపివేత..

కరెంట్‌ స్తంభాలు, తీగలకు సమీపంలో ఇళ్లు కడుతుంటే గతంలో కనెక్షన్‌ కత్తిరించి నిర్మాణాలు ఆపించిన దాఖలాలు ఉన్నాయి. బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో ఇదే తరహాలో సికింద్రాబాద్‌ లైన్స్‌ డీఈ కోటేశ్వరరావు ఆ ఇంటి విద్యుత్తు సరఫరా నిలిపేశారు. స్తంభాలకు, తీగలకు సమీపంలో వేసిన స్లాబ్‌ను కూల్చిన తర్వాతనే సరఫరా పునరుద్ధరించారు. విద్యుత్తు అధికారులు అభ్యంతర పెడితే ఇంటి నిర్మాణదారులు వెనక్కి తగ్గుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని