logo

అందుబాటులో ఇండోర్‌ స్టేడియం

జిల్లాలో వ్యాపార కేంద్రమైన తాండూరులో ఔత్సాహిక క్రీడాకారులకు ఇండోర్‌ స్టేడియం అందుబాట్లోకి రాబోతోంది. ఏడాది క్రితం ప్రారంభమైన పనులు తుది దశకు చేరాయి.

Published : 17 Jun 2024 01:59 IST

ఔత్సాహిక క్రీడాకారులకు ప్రోత్సాహం 

న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ: జిల్లాలో వ్యాపార కేంద్రమైన తాండూరులో ఔత్సాహిక క్రీడాకారులకు ఇండోర్‌ స్టేడియం అందుబాట్లోకి రాబోతోంది. ఏడాది క్రితం ప్రారంభమైన పనులు తుది దశకు చేరాయి. నెల రోజుల్లో ప్రారంభోత్సవం చేయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  

రూర్బన్‌ పథకం కింద ఎంపిక

తాండూరు మండలం రూర్బన్‌ పథకం కింద ఎంపికైంది. ఈ పథకం ద్వారా మంజూరైన నిధుల్లో రూ.2కోట్లు ఇండోర్‌ స్టేడియంకు కేటాయించారు. దీంతో స్టేడియం నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని అంతారం వద్ద సంగారెడ్డి, జహీరాబాద్‌ రహదారిని ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. అప్పటి పాలనాధికారిణి పౌసుమిబసు పనులు ప్రారంభింపజేశారు. ఏడాది నుంచి కొనసాగిన పనులు తుదిదశకు చేరాయి. ప్రత్యేక గచ్చు నిర్మాణం, సింథటిక్‌ గచ్చు నిర్మాణ పనులు, ద్వారం, ప్రహరీ పనులు కొనసాగుతున్నాయి. వీటిని నెలరోజుల్లోగా పూర్తి చేయనున్నారు. దీంతో జులై మాసంలో ప్రారంభోత్సవం చేయించేందుకు టీఎస్‌డీడబ్ల్యూఐడీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

అన్ని రకాల పోటీల నిర్వహణకు వీలు

తాండూరు నియోజకవర్గ స్థాయిలో అందుబాట్లో ఉన్న ఏకైన చిన్నమైదానం (మినీ స్టేడియం) 2016 సంవత్సరంలో రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయంగా మారింది. దీంతో విద్యార్థులు, యువతీ యువకుల క్రీడలకు మైదానం కరవైంది. ఈ క్రమంలో కొత్తగా ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి సంకల్పించారు. దాదాపు లక్ష మందికిపైగా యువతీ యువకులకు, విద్యార్థుల క్రీడలకు మార్గం సుగమం కానుంది. చెస్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో, క్యారం, పుట్‌బాల్, వాలీబాల్‌ క్రీడల సాధనకు, పోటీలు నిర్వహణకు వేదికగా మారనుంది. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి పోటీలు నిర్వహించేందుకు వీలు కలుగుతుంది.  ప్రతి సంవత్సరం ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు నిర్వహించే పోటీలకు సద్వినియోగం చేసే ఆస్కారం ఏర్పడుతుంది. క్రీడా పోటీల సమయంలో ప్రైవేటు పాఠశాలల మైదానాలపై ఆధారపడే బాధలు తప్పనున్నాయి. క్రీడల సాధనతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం, క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు, మెలకువలు నేర్చుకునేందుకు తోడ్పడుతుంది.  


జులైలో అందుబాటులోకి తెస్తాం

- శ్రీనివాస్, ఏఈ, టీఎస్‌డీడబ్ల్యూఐడీసీ, తాండూరు

ఇండోర్‌ స్టేడియం పనులు పూర్తికావచ్చాయి. గచ్చు పనులు నెలరోజుల్లో పూర్తి చేయిస్తాం. వచ్చే నెలలో స్టేడియాన్ని అందుబాట్లోకి తెస్తాం. విద్యార్థులు, యువతీయువకులు సద్వినియోగం చేసుకుంటే ఉద్యోగావకాశాలు పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని