logo

పెరగని రుణం.. పెట్టుబడి భారం

సాగు సమయంలో అన్నదాతలకు పెట్టుబడి కష్టాలు తప్పడం లేదు. పంట రుణాల ఆర్థిక కొలత (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) కూడా తక్కువగానే ఉండటంతో రైతులకు మళ్లీ భారం పడుతోంది.

Published : 17 Jun 2024 02:05 IST

అధిక వడ్డీలకు తీసుకోవాల్సిన స్థితి  
న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌

సాగు సమయంలో అన్నదాతలకు పెట్టుబడి కష్టాలు తప్పడం లేదు. పంట రుణాల ఆర్థిక కొలత (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) కూడా తక్కువగానే ఉండటంతో రైతులకు మళ్లీ భారం పడుతోంది. వానాకాలం సీజన్‌ ప్రారంభంతో రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఎరువులు, విత్తనాలు కొనుగోళ్లపై దృష్టి సారించారు. వర్షాలు బాగా పడి పుడమి సరిపడా తడిసిన వెంటనే విత్తనాలు విత్తుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో విత్తనాలు అనువైన ప్రాంతాల్లో విత్తనాలు విత్తుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో బ్యాంకుల ద్వారా మంజూరవుతున్న రుణం సరిపోక అన్నదాత నానా పాట్లు పడుతున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

అధిక సాగుపై అంచనా

జిల్లాలోని పరిగి, వికారాబాద్, కొడంగల్, తాండూరు నియోజక వర్గాల పరిధిలో ఖరీఫ్‌ సాధారణ సాగు 5,85,105 ఎకరాలు ఉండగా అంతకుమించి సాగులోకి రానుందని వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో ప్రధానంగా పత్తి 2,06,353 ఎకరాల్లో సాగులోకి రానుంది. గతేడాది కూడా బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తిచేయలేదు. కూలీల ధరలు విపరీతంగా పెరిగాయి. రెండేళ్ల క్రితం కిలో పత్తిని పొలం నుంచి తీసేందుకు రూ.6 ఇస్తుండగా ప్రస్తుతం అది రూ.12కు చేరుకుంది. మొత్తంగా కూలీ ధరలు రెట్టింపయ్యాయి. కనీసం ఈసారైనా పూర్తిస్థాయిలో రుణాలు మంజూరు చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.

ఆర్థిక కొలత నామమాత్రమే.. 

ప్రధాన పంటలకు కూడా రుణ ఆర్థిక కొలత నామమాత్రంగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది వరికి ఎకరాకు రూ.45వేలు ఉండగా ఈసారి కూడా అంతే నిర్ధరించారు. జొన్నలకు గతేడాది రూ.19వేలు ఉండగా ఈసారి కేవలం వెయ్యి మాత్రమే పెంచారు. పెరిగిన ధరలతో పోల్చితే రుణ మంజూరు తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని రైతులు వాపోతున్నారు. అందిన మేరకు బయట రూ.2నుంచి రూ.3చొప్పున వడ్డీకి రుణాన్ని తీసుకువచ్చి సాగుకు ఉపక్రమించాల్సి వస్తోందని వాపోతున్నారు.

బ్యాంకర్ల కొర్రీలు

స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం కూడా బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయడం లేదు. నిర్దేశించిన దానికంటే  రూ.5వేల వరకు తక్కువే ఇస్తున్నారు. అదేమని అడిగితే పూర్తిస్థాయిలో ఇవ్వడం కుదరదని చెబుతున్నారు. గతేడాది యాసంగి, వర్షాకాలం కలిపి రూ.2582.24కోట్లు మంజూరు చేయడం లక్ష్యంగా పెట్టుకోగా 80శాతం మాత్రమే పంపిణీ పూర్తిచేశారు. 


బ్యాంకర్ల సహకారాన్ని కోరతాం

- రాంబాబు, లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌. 

పంట రుణాలు అధికంగా  మంజూరు చేసే విధంగా బ్యాంకర్లను కోరతాం. గతేడాది నిర్దేశించిన లక్ష్యాన్ని 85 శాతం మేరకు పూర్తిచేశాం. మంజూరులో సమస్యలు తలెత్తకుండా చూస్తాం.  రైతులకు అన్ని విధాలా న్యాయం చేసేందుకు కృషి చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని