logo

ధరణి.. ఈ సారైనా దయచూపేనా

ధరణి పోర్టల్‌ లోపాలు సవరించేందుకు చేపట్టిన ప్రత్యేక పరిష్కార ప్రక్రియకు మోక్షం లభిస్తుందనే ఆశ రైతుల్లో మొదలయ్యింది.

Published : 17 Jun 2024 02:10 IST

నిషేధిత జాబితాల్లో రైతుల భూములు 
పట్టాదారులకు తెలియకుండానే అమ్మకాలు 

ఈనాడు,హైదరాబాద్, శామీర్‌పేట్, న్యూస్‌టుడే: ధరణి పోర్టల్‌ లోపాలు సవరించేందుకు చేపట్టిన ప్రత్యేక పరిష్కార ప్రక్రియకు మోక్షం లభిస్తుందనే ఆశ రైతుల్లో మొదలయ్యింది.   ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 45వేల ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. 11వేల దరఖాస్తులు మేడ్చల్‌లో ఉన్నాయి. ధరణి పోర్టల్‌లో భూముల వివరాలను నమోదు చేసేటప్పుడు సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రభుత్వ భూముల ఖాతాలోకి వెళ్లాయి. నిషేధిత జాబితాలో చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు పట్టాదారుల భూములు వారికి తెలియకుండానే అక్రమార్కుల పరమయ్యాయి.

లోపాల పుట్టలు...: ధరణి పోర్టల్‌లో భూముల వివరాలు నమోదు చేసేటప్పుడు వచ్చిన లోపాలను అప్పటి అధికారులు పట్టించుకోలేదు. పైగా నిబంధనలు కఠినంగా మార్చారు. పట్టా భూములను అమ్మాలన్నా, కొనాలన్నా.. భూమిపై హక్కున్న వారసుల్లో ఒకరిద్దరి పేర్లు అదనంగా నమోదు చేయాలన్నా... భూములు కొన్న యజమానులు, సంస్థల పేర్లలో మార్పులు చేర్పులు చేయాలన్నా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తప్పులు సవరించుకునేందుకు మళ్లీ దరఖాస్తులు చేసుకున్నా పరిష్కారం కాలేదు.

  • శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేట గ్రామానికి చెందిన వందమంది రైతుల కుటుంబాలకు చెందిన 450 ఎకరాల పంటపొలాలు ధరణి పోర్టల్‌లో ప్రభుత్వ, అటవీ భూములుగా నమోదు చేశారు. నాలుగేళ్లుగా పోరాడుతున్నా ఇప్పటికీ ప్రభుత్వ అధికారులు వారిని కనికరించడం లేదు. 
  • ఫార్మాసిటీకి సమీపంలోని కుర్మిద్ద గ్రామంలో 50మంది రైతులకు చెందిన 98 ఎకరాలను ధరణిలో అటవీభూములుగా నమోదు చేశారు. అటవీశాఖ అధికారులు ఆ భూమి మాదికాదని చెప్పినా  మార్పు చేయలేదు. 

అదే ప్రామాణికం...: ధరణి పోర్టల్‌లో లోపాలున్నాయంటూ పట్టాదారులు, రైతులు రెవెన్యూ అధికారులకు చెబుతున్నా... వారు మాత్రం  ఆ పోర్టల్‌లో ఉన్నదే ప్రామాణికం అంటూ తెగేసి చెబుతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని సబర్బన్‌ ప్రాంతాలు, శివారు మున్సిపాలిటీలతో పాటు చాలా గ్రామాల్లో రైతులు, భూ యజమానులు స్థిరాస్తి సంస్థలకు భూములు విక్రయిస్తున్నప్పుడు లోపాలు వెలుగుచూస్తున్నాయి. మా పోర్టల్‌లో మీ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి. అమ్మేందుకు వీల్లేదు... అంటూ తిరస్కరిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని