logo

ఎక్కడ నడవాలో అడుగు?

అభివృద్ధి చెందిన దేశాల్లో రోడ్లకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. పాదచారులకూ అదే గౌరవం ఉంటుంది. విశ్వనగరమని చెప్పుకొనే హైదరాబాద్‌లో మాత్రం ఆ పరిస్థితి లేదు. కనీస మర్యాద కూడా కనిపించడం లేదు.

Published : 17 Jun 2024 02:22 IST

కాలిబాటల నిర్మాణానికి రూ.కోట్ల వ్యయం
చాలాచోట్ల ఆక్రమణ
ఈనాడు, హైదరాబాద్‌

భివృద్ధి చెందిన దేశాల్లో రోడ్లకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. పాదచారులకూ అదే గౌరవం ఉంటుంది. విశ్వనగరమని చెప్పుకొనే హైదరాబాద్‌లో మాత్రం ఆ పరిస్థితి లేదు. కనీస మర్యాద కూడా కనిపించడం లేదు. అక్కడక్కడ.. అప్పుడప్పుడు.. రూ.కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మిస్తోన్న కాలిబాటలు  ఆక్రమణకు గురవుతున్నాయి. రోడ్డు పక్కనున్న దుకాణాలు, వ్యాపార సముదాయాలు వాటిని మింగేస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదు. 

నమూనా కారిడార్లలోనూ:  జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం ఇన్నర్‌ రింగు రోడ్డు పొడవునా రూ.56.8కోట్లతో 29 నమూనా కారిడార్లను నిర్మించేందుకు జనవరి, 2023న టెండర్లు పిలిచింది. ఉప్పల్‌ నుంచి హబ్సిగూడ వరకు, తార్నాక నుంచి హబ్సిగూడ, నాగోల్‌ నుంచి కామినేని కూడలి, ఎల్బీనగర్‌ ఎక్స్‌ రోడ్డు నుంచి చింతలకుంట వరకు, బైరామల్‌గూడ చౌరస్తా నుంచి కాటేదాన్‌ వరకు ఇతరత్రా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఎల్బీనగర్‌ జోన్‌లో పనులు దాదాపు పూర్తయ్యాయి. సికింద్రాబాద్‌ జోన్లోనూ మెజార్టీ పనులు కొలిక్కి వచ్చాయి. కొన్ని నాణ్యత లేకుండా పోతే..కొన్ని కారిడార్లు కబ్జాకు గురయ్యాయి.


ప్రధాన రహదారులపై ఇలా..! 

  • మూసాపేట చౌరస్తా వద్ద సత్తిబాబు బిర్యానీ హోటల్, దాని పక్కనున్న మిఠాయి దుకాణం, ఎర్రగడ్డ కూడలి వద్దనున్న కొత్త షాపింగ్‌మాల్, ఈఎస్‌ఐ ఆస్పత్రి, ఎస్‌ఆర్‌నగర్‌ చౌరస్తా, అమీర్‌పేట మైత్రి వనం నుంచి పంజాగుట్ట మెట్రో స్టేషన్‌ వరకు..
  • పంజాగుట్ట కూడలిలోని మెరిడియన్‌ హోటల్, దాని పక్కనున్న మాంసం దుకాణం వరకు కాలిబాట పూర్తిగా కబ్జాకు గురైంది. 
  • కాలిబాటే కాదు.. దాని ముందున్న రోడ్డు కూడా పది అడుగులు వాహనాల పార్కింగ్‌ కేంద్రంగా, దుకాణాలుగా మారిపోయాయి.
  • ఈఎస్‌ఐ మెట్రో స్టేషన్‌ నుంచి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ వరకు విశాలంగా నిర్మించిన కాలిబాట పండ్ల వ్యాపారాలకు, దుకాణాల సరకులను ప్రదర్శించేందుకు, రకరకాల వ్యాపారాలకు ఉపయోగపడుతోంది. 
  • ఇలా ఉండటంతో పాదచారులు రోడ్లపై వెళ్లాల్సివస్తోంది. ఎంత జాగ్రత్తగా వెళ్తున్న వాహనాలు ఢీ కొంటున్నాయి. ఏటా వందల్లో మరణాలు, క్షతగాత్రులుంటున్నారు.
  • సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఏటా 4వేలకుపైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 200 మంది చనిపోతున్నారు. వందలాది మంది గాయాలపాలవుతున్నారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని