logo

నీరు.. చేనుకు చేరేదెలా..?

జిల్లాలో అతిపెద్దదైన కోట్‌పల్లి జలాశయం నుంచి 9,200 ఎకరాలకు 36.72 కి.మీ. పొడవుతో ఉన్న కుడి, ఎడమ కాలువల నుంచి సాగు నీరు అందాలి.

Published : 18 Jun 2024 02:40 IST

మరమ్మతులకు నోచని జలాశయాల కాలువలు, తూములు
జిల్లాలోనే అతి పెద్దది.. దశాబ్దాలుగా అధ్వానం

 కోట్‌పల్లి జలాశయం కుడికాలువ ఇలా.. 
జిల్లాలో అతిపెద్దదైన కోట్‌పల్లి జలాశయం నుంచి 9,200 ఎకరాలకు 36.72 కి.మీ. పొడవుతో ఉన్న కుడి, ఎడమ కాలువల నుంచి సాగు నీరు అందాలి. రెండున్నర దశాబ్దాలకు పైగా నిర్వహణ సవ్యంగా లేక కాలువలు, తూములు, సరఫరా వ్యవస్థ దెబ్బతింది. కేవలం 4,000 ఎకరాలకే సాగు నీరు అందుతోంది. జలాశయం మరమ్మతుకు రూ.110 కోట్లు కావాలంటూ నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. నిధులు మంజూరు కాలేదు.
న్యూస్‌టుడే, తాండూరు: జిల్లాలోని జలాశయాల నుంచి ఈ ఏడాది చివరి ఆయకట్టుకు సాగు నీరందే పరిస్థితి కనిపించడంలేదు. తూములు బాగు పడలేదు. కాలువల్లో పూడిక పేరుకు పోయి నీరు పారేందుకు, నిలిచేందుకు వీలు లేకుండా పోయింది. నీటి మళ్లింపు కాలువలు (డిస్ట్రిబ్యూటరీలు) దెబ్బతిన్నాయి. మరమ్మతుల గురించి పట్టించుకునే వారే లేకపోయారు.  ప్రస్తుత వర్షాకాలంలో జలాశయాలు నిండగానే సాగుకు నీటిని విడుదల చేసినా చివరి ఆయకట్టు వరకు చేరే పరిస్థితి లేదు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ ‘పరిశీలనాత్మక’ కథనం. 

21,027 ఎకరాల్లో సగం ఆయకట్టుకే.. 

జిల్లాలోని పది జలాశయాల పరిధిలో 21,027 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. కాలువలు, తూములు మరమ్మతుకు గురైన కారణంగా కేవలం సగం ఆయకట్టు కంటే తక్కువ భూములకే నీరందనుంది. మిగిలిన భూముల్లో రైతులు వర్షాధార పంటలైన కందులు, పత్తి, పెసలు, మినుములు, జొన్న వంటివి సాగు చేసేందుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు.  

19 ఏళ్లుగా సాగుతున్న శివసాగర్‌

యాలాల మండలంలో కాకరవేణి నదిని ఆధారం చేసుకుని రూ.11.60 కోట్ల వ్యయంతో చేపడుతున్న శివసాగర్‌ జలాశయం పనులు 19ఏళ్ల నుంచి సాగుతూనే ఉన్నాయి. అలుగు విస్తరణ పనులు వేసవి కాలం చివర్లో ప్రారంభిస్తారు. వర్షాలు షురూ కాగానే పనులు ఆపి వేయడం ఆనవాయితీగా వస్తోంది. 1,000 ఎకరాలకు సాగు నీరందించేందుకు 5 కిలోమీటర్ల పొడవునా కాలువలు చేపట్టాలి. ఇందుకోసం 26 ఎకరాల భూ సేకరణ జరిగింది. గుత్తేదారు మాత్రం ఇప్పటి వరకు కాలువల నిర్మాణం చేపట్టలేదు. 

పట్టించుకునే వారే కరవయ్యారు

పరిగి, న్యూస్‌టుడే: పరిగి మండలంలోని లఖ్నాపూర్‌ రిజర్వాయర్, కాలువల మరమ్మతులకు ఏళ్లుగా ప్రతిపాదనలు వెళ్తున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. ఈ ప్రాజెక్టు మొత్తం లోతు  లోతు 18 అడుగులు ఉండగా 2647 ఎకరాలు ఆయకట్టు భూమి ఉంది. ఇందులో కుడి కాల్వ కింద 1132 ఎకరాలు, ఎడమ కాల్వ కింద 1505 ఎకరాలుగా ఉంది. పరిగి,రెండు ప్రధాన కాల్వలు మరమ్మతులకు నోచక పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి నీరు నిలవడంలేదు.  

  •  కుల్కచర్ల మండలం అంతారం సమీపంలోని పాటిమీది చెరువు జలాశయం కూడా అధ్వానంగా ఉంది. రెండు కాల్వలు నిరుపయోగంగా మారాయి. మరమ్మతులకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు ఏఈ సిద్ధార్థ తెలిపారు. 

     నిధులు కావాలని ప్రతిపాదనలు పంపాం 

జలాశయాల కాలువలు, తూముల మరమ్మతుకు నిధులు లేకనే పనులు చేపట్టడం లేదు. ఆయా జలాశయాలకు సంబంధించి ప్రభుత్వానికి రూ.కోట్లల్లోనే నిధులు కావాలని ప్రతిపాదనలు పంపించాం. వానాకాలంలో జలాశయాలు నీటితో నిండితే ఏ జలాశయం నుంచి ఎంత ఆయకట్టు వరకు నీరందుతుందో అంత మేరకే విడుదల చేస్తాం.

- సుందర్, కార్యనిర్వాహక ఇంజినీరు, జిల్లా నీటిపారుదల శాఖ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు