logo

ఆర్తితో ప్రార్థన.. ప్రేమతో అభినందన

జిల్లా వ్యాప్తంగా సోమవారం బక్రీద్‌ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు.

Published : 18 Jun 2024 02:43 IST

జిల్లాలో భక్తిశ్రద్ధలతో బక్రీద్‌  

తాండూరులో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌ తదితరులు   
న్యూస్‌టుడే, తాండూరు టౌన్, దోమ, తాండూరు, పరిగి: జిల్లా వ్యాప్తంగా సోమవారం బక్రీద్‌ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. వికారాబాద్, కొడంగల్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో ఈద్గాల వద్ద భక్తిశ్రద్ధలతో ఉదయంనుంచే ప్రార్థనలు నిర్వహించారు. పరస్పరం ఆలింగనం చేసుకుని అభినందనలు తెలియజేసుకున్నారు. తాండూరు పట్టణ శివారులోని ఈద్గా, కేసీఆర్‌ నగర్‌లోని ఈద్గాలో ప్రార్థనలు చేయటానికి ముస్లిం సోదరులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. చల్లగా చూడాలని అల్లాను వేడుకున్నారు. ప్రత్యేక దుస్తుల వేషధారణ, తల పాగాలతో యువకులు, చిన్నారులు ఆకట్టుకున్నారు. ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో అతిథులకు క్షీర్‌ కూర్మ తినిపించారు. ఎమ్మెల్యే బుయ్యని, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, బీసీ కమిషన్‌ సభ్యుడు శుభ్‌ప్రద్‌ వేర్వేరుగా శ్రేయోభిలాషులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి బక్రీద్‌ వంటకాలను రుచి చూశారు. డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామీణ సీఐ అశోక్‌ కుమార్, పట్టణ సీఐ సంతోష్‌ కుమార్‌ పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. 

  •  తాండూరులోని ఖాంజాపూరు గేటు, చెంగేష్‌ పూరు దారిలోని ఈద్గాల వద్ద  ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావును ముస్లిం సోదరులు కలవగా  పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనారోగ్యానికి లోనై హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సామాజిక మాధ్యమం ద్వారా బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. సంతోషంగా ఉండాలన్నారు.

త్యాగానికి ప్రతీక  - ఎమ్మెల్యే  

త్యాగానికి ప్రతీక బక్రీద్‌ పండగ అని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం బక్రీద్‌ పండగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీక వంటివని చెప్పారు. పండగలతో సమానత్వం అలవడుతుందని వివరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు