logo

ఐటీ కారిడార్‌పై రెవెన్యూ నజర్‌

ఐటీ కారిడార్‌లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు.

Updated : 18 Jun 2024 05:06 IST

ప్రభుత్వ భూముల రికార్డులు.. ధరణి పోర్టల్‌ పరిశీలన

స్థలాల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ

గంధంగూడలో ఆక్రమణల తొలగించి బోర్డు పాతి.. 

ఐటీ కారిడార్‌లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ప్రైవేటు భూములకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను నిజాం వారసుల నుంచి కొన్నామంటూ తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారి నుంచి కాపాడేందుకు కార్యాచరణ రూపొందించారు. 1940 నుంచి ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న భూములు, ధరణి పోర్టల్‌లో భూముల వివరాలను పరిశీలించనున్నారు. శేరిలింగంపల్లి, గండిపేట, రాజేంద్రనగర్‌ మండలాల్లోని  ప్రభుత్వ భూములను చెరబట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే గండిపేట, శేరిలింగంపల్లి మండలాల్లో రూ.వెయ్యికోట్లకు పైగా ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను కొద్దిరోజుల క్రితం స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు మండలాల్లో భూముల ధరలు రూ.కోట్లకు పెరగడం, బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం అవుతుండడంతో ప్రభుత్వ భూములను పరిరక్షించనున్నారు.

కోర్టులు..  ట్రైబ్యునల్‌ తీర్పులు 

ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిలో 90 శాతం మంది కోర్టులు, రంగారెడ్డి జిల్లా ట్రైబ్యునళ్లను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ భూముల సర్వే నంబర్లకు అదనంగా ఒకటి, రెండు అంకెలు జోడించి తప్పుడు పత్రాలు సృష్టించి న్యాయం చేయాలంటున్నారు. పాత రికార్డులపై ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్లలో కొంతమందికి పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో నిర్ణయాలు తీసుకునేందుకు ఆలస్యమవుతోంది. మరోవైపు ఏళ్లతరబడి తహసీల్దార్‌ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో కొందరు అక్రమార్కుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు తీసుకుని వారికి అనుకూలంగా పత్రాలు తయారు చేస్తున్నారు. దీంతో కోర్టులు, ట్రైబ్యునళ్లలో  పెండింగ్‌ ఉన్న దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించాక అధికారులు వాటికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను సమర్పించనున్నారు. ఇందుకోసం రెవెన్యూ శాఖలో విధులు నిర్వహించిన సీనియర్లు, విశ్రాంత అధికారుల సహాయం తీసుకోనున్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌


డిజిటల్‌ సర్వేలు,  సరిహద్దులు 

చెరువులను సైతం కొందరు ఆక్రమార్కులు పూడ్చేస్తున్నారు. గండిపేట, శేరిలింగంపల్లిలలో ఇప్పటికే నలభైకి పైగా చెరువులను పాక్షికంగా, మరికొన్నింటిని పూర్తిగా ఆక్రమించారు. వీటిని నిరోధించేందుకు వీలుగా రెవెన్యూ అధికారులు డిజిటల్‌ సర్వేలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ భూముల సరిహద్దులను, ప్రైవేటు భూముల సరిహద్దులను పోల్చేందుకు వీటిని వినియోగించనున్నారు. ఇందుకోసం కొత్త పరికరాలను తీసుకొస్తున్నారు. వీటి వల్ల ప్రభుత్వ భూములను, చెరువులను ఆక్రమించిన వెంటనే తెలిసిపోతుంది. వెంటనే ఆక్రమణదారులపై క్రిమినల్‌ చర్యలు చేపట్టడంతో పాటు నిర్మాణాలను కూల్చేయనున్నారు. గతంలో తాఖీదులిచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటుండగా... భవిష్యత్తులో మాత్రం వేగంగా చర్యలు చేపట్టేందుకు నిర్ణయించారు. చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీనియర్‌ రెవెన్యూ అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు పోలీసుల సమక్షంలోనే కూల్చివేతలను పూర్తిచేయనున్నామని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని