logo

జలమండలి ఈడీ మళ్లీ ఆయనేనా?

పదవీ విరమణ చేసినా ఎనిమిదేళ్లగా అవే బాధ్యతల్లో కొనసాగుతున్న జలమండలి ఉన్నతాధికారి ఆయన. తాజాగా తొమ్మిదో సంవత్సరం పొడిగింపునకూ రంగం సిద్ధమైంది.

Published : 18 Jun 2024 03:22 IST

రిటైర్‌ అయినా 8 ఏళ్లుగా అవే బాధ్యతల్లో

మరోసారి కొనసాగించాలని ప్రభుత్వానికి చేరిన దస్త్రం

ఈనాడు, హైదరాబాద్‌: పదవీ విరమణ చేసినా ఎనిమిదేళ్లగా అవే బాధ్యతల్లో కొనసాగుతున్న జలమండలి ఉన్నతాధికారి ఆయన. తాజాగా తొమ్మిదో సంవత్సరం పొడిగింపునకూ రంగం సిద్ధమైంది. ఈమేరకు జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ సత్యనారాయణ 2016లో పదవీ విరమణ చేసినా కీలకమైన ఎగ్జిక్యూటివ్‌ డెరెక్టర్‌ (ఈడీ) పోస్టులోనే కొనసాగుతున్నారు. పదవీ విరమణ చేసిన అధికారులను ఇంటికి పంపించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించి కొంతమందిని పంపింది కూడా. అయినా కొన్ని విభాగాల్లో పలుకుబడి గలిగిన అధికారులు ఇంకా కొనసాగుతున్నారు. పలు ప్రాజెక్టులు సత్యనారాయణ ఆధ్వర్యంలో కొనసాగుతుండటంతో పదవీ విరమణ పొందిన ఆయనను భారాస ప్రభుత్వం ఈడీగా కొనసాగిస్తూ వచ్చింది. ఈ జులై నెలాఖరుతో గడువు ముగియనుండటంతో మరోసారి పదవిలో కొనసాగించేందుకు జలమండలి నుంచి దస్త్రం ప్రభుత్వానికి చేరింది. దీనిపై జలమండలిలో ఇతర అధికారులు, ఇంజినీరింగ్‌ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ఇతరులకూ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితితోనూ ఆయన్ను కొనసాగించడానికి వీల్లేదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. వాస్తవానికి గతంలో ఎండీ, ఈడీ పోస్టుల్లో ఐఏఎస్‌ అధికారులను నియమించేవారు. సత్యనారాయణ ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ అయిన తర్వాత నుంచి ఈడీ పోస్టులో ఆయనే కొనసాగుతూ వచ్చారు. ఈయనతోపాటు లా విభాగంలో ఓస్డీగా పనిచేస్తున్న అధికారి అవుట్‌ సోర్సింగ్‌పై బాధ్యతలు చేపడుతున్నారు. ఆయన పదవీ గడువు తీరడంతో మరోసారి బాధ్యతలు పొడిగింపునకు సంబంధించిన దస్త్రం ప్రభుత్వానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ రెండు దస్త్రాలపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు