logo

కోడ్‌ మాటున.. కట్టేశారు!

కొందరు చిన్న బిల్డర్లు నిబంధనలు తుంగలో తొక్కి జీప్లస్‌ 2, 3 అనుమతులు తీసుకొని ఆరేడు అంతస్తులు నిర్మించి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

Updated : 18 Jun 2024 05:38 IST

హెచ్‌ఎండీఏ పరిధిలో భారీగా అక్రమ నిర్మాణాలు

నార్సింగ్‌లో నిర్మిస్తున్న అక్రమ భవనం 

తాజా పరిశీలనతో వెలుగులోకి

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ.. పార్లమెంట్‌ ఎన్నికలు వరుసగా రావడంతో కోడ్‌తో ప్రభుత్వ కార్యకలాపాల్లో స్తబ్దత నెలకొంది. ఇదే అదనుగా ఈ 6 నెలల  కాలాన్ని అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలకు తెరతీశారు. అనుమతులు లేకుండానే భారీ భవనాలు నిర్మించిన వారు కొందరైతే.. ఇంకొందరు జీప్లస్‌ 2 నుంచి 5 వరకు అనుమతులు పొంది, అదనంగా 2, 3 అంతస్తులు నిర్మించేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ అధికారులతో కలిసి హెచ్‌ఎండీఏ ఈ అక్రమ నిర్మాణాలపై తాజాగా దృష్టి సారించగా ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. మణికొండ, శంషాబాద్, మేడ్చల్, ఘట్‌కేసర్, శంకర్‌పల్లి జోన్ల పరిధిలో వందల సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలు తుది దశలో ఉన్నట్లు గుర్తించారు. కొందరు వీటిలో చాలావరకు అమ్మేశారు. గతంలోనే ఈ నాలుగు జోన్ల పరిధిలో దాదాపు 600 వరకు అక్రమ భవనాలు గుర్తించారు. ఇందులో బహుళ అంతస్తుల్లో ఉన్న 250 భవనాలను పాక్షికంగా కూల్చారు. వాటికి నిర్మాణదారులు మరమ్మతులు చేయించి పూర్తిచేశారు.

చేయి తడిపితే చాలు...

హెచ్‌ఎండీఏ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులకు సమాచారమున్నా అడ్డుకట్ట వేయరు. అంతస్తుకు ఇంతని లెక్కకట్టి వాటి వైపు చూడరు. భవనం పూర్తయిన తర్వాత ఫిర్యాదులొస్తే వెళ్లి గోడలకు రంధ్రాలు పెట్టి ప్రహరీ కూలగొట్టి అయిందనిపిస్తున్నారు. 

బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయ్‌..

కొందరు చిన్న బిల్డర్లు నిబంధనలు తుంగలో తొక్కి జీప్లస్‌ 2, 3 అనుమతులు తీసుకొని ఆరేడు అంతస్తులు నిర్మించి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా భవనాలకు రిజిస్ట్రేషన్లు కావడం, కొన్ని బ్యాంకులు రుణాలు సైతం మంజూరు చేస్తుండటంతో వినియోగదారులు ఇవన్నీ సక్రమమే అనుకుంటున్నారు. చివరికి కూల్చివేతలు చేపట్టినప్పుడు లబోదిబోమంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని