logo

చెత్త డబ్బా.. శుభ్రం చేసేదెవరబ్బా?

స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేలో మంచి మార్కులు పొందాలన్న ఉద్దేశంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య విభాగం ఏడాదికోసారి నగరంలోని రోడ్లపై చెత్త డబ్బాలను ఏర్పాటు చేస్తోంది.

Published : 18 Jun 2024 03:38 IST

వ్యర్థాలతో నిండిపోతున్నా పట్టించుకోని యంత్రాంగం
తొలగించాల్సింది నువ్వా.. నేనా అంటోన్న జీహెచ్‌ఎంసీ, రాంకీ
ప్రధాన రహదారులపై ఊపిరి తీసుకోలేని దుస్థితి

ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం ప్రహరీ వద్ద వారం నుంచి ఇలాగే..  
ఈనాడు, హైదరాబాద్‌: స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేలో మంచి మార్కులు పొందాలన్న ఉద్దేశంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య విభాగం ఏడాదికోసారి నగరంలోని రోడ్లపై చెత్త డబ్బాలను ఏర్పాటు చేస్తోంది. అందుకోసం దాదాపు రూ.3 కోట్లు వెచ్చిస్తోంది. ఏర్పాటు చేశాక నిర్వహణను అధికారులు గాలికొదిలేస్తున్నారు. డబ్బాల్లోని చెత్తను ఎవరు తొలగించాలనే అంశంపై స్పష్టత కొరవడింది. జీహెచ్‌ఎంసీ, రాంకీ సంస్థలు నువ్వంటే నువ్వని చెప్పుకొంటూ బాధ్యతను విస్మరిస్తున్నాయి. దాంతో.. అవన్నీ వ్యర్థాలతో నిండిపోయి పరిసరాల్లో దుర్వాసన వస్తోంది. పాదచారులు అటుగా నడవలేని దుస్థితి నెలకొంది.

అనాథలైన డబ్బాలు..

  2021, 2022లో మాదిరే 2023లో 2,794 డబ్బాలను జీహెచ్‌ఎంసీ కొనుగోలు చేసింది. వాటిని ప్రధాన రహదారులకు ఇరువైపులా కాలిబాటలపై ఏర్పాటు చేసింది. అంతవరకు అధికారుల్లో కనిపించిన శ్రద్ధ.. తర్వాత మాయమైంది. వాటిని ఎవరు శుభ్రం చేయాలనే అంశాన్ని నిర్ణయించలేదు. వాణిజ్య కేంద్రాల చెంత, ప్రధాన రహదారులు, వీధుల్లో ఉండే చెత్తను శుభ్రం చేసే బాధ్యత రాంకీ సంస్థకు అప్పగించడంతో.. చెత్త డబ్బాలను ఆ సంస్థ పట్టించుకోవట్లేదు. అలాగని.. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులూ క్రమం తప్పకుండా శుభ్రం చేయట్లేదు.  

మొక్కుబడి కార్యక్రమంగా మారి...

పాదచారులు తమ చేతిలోని చిత్తు కాగితాలు, ఇతర వ్యర్థాలను, మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఈ డబ్బాల్లో వేస్తుంటారు. రెండు, మూడు రోజులకోసారైనా వాటిని శుభ్రం చేస్తుంటే.. ప్రజలు మరింత ఎక్కువగా ఉపయోగించే వీలుంటుంది. పది రోజులు, రెండు వారాలు, నెలకోసారి శుభ్రం చేస్తుండటంతో.. అన్ని రోజులపాటు వ్యర్థాలతో నిండి కనిపిస్తున్నాయి. ఆ క్రమంలో దుర్గంధం  వస్తోంది. రద్దీ ప్రాంతాల్లో  వాటి పరిసరాల్లో జనం నిలవలేని పరిస్థితి ఉంది. అధికారులు కమీషన్ల కోసం డబ్బాలను కొనుగోలు చేస్తున్నారని, మొక్కుబడిగా వాటిని రోడ్లపై ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.

మాంసం వ్యర్థాల తరలింపులో నిర్లక్ష్యంతో...

 హోటళ్లు, రెస్టారెంట్లలో మిగిలిన ఆహార పదార్థాలను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నాయి. మాంసం దుకాణాలు, చేపల మార్కెట్లలోని వ్యర్థాలనూ వారే తీసుకెళ్తున్నారు. ఆ క్రమంలో వాటిని తరలించే వాహనాల వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మూతలేని ట్రాలీల్లో జంతు వ్యర్థాలను నిండుగా పోస్తున్నారు. వాటిలోని రక్తం, ద్రవ వ్యర్థాలు ట్రాలీ నుంచి రోడ్లపై పడుతున్నాయి.  తరలించే క్రమంలో రోడ్లన్నీ వాటితో తడిసిపోతున్నాయి. వాసన వ్యాపిస్తోంది. ట్రాలీ వెనుక ప్రయాణించే వాహనదారులు నరకం చూస్తున్నారు. జంతు వ్యర్థాల యాజమాన్యం, తరలింపుపై జీహెచ్‌ఎంసీ దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు