logo

భూముల విలువ పెంపుదలకు అధ్యయనం

ప్రభుత్వం భూముల మార్కెట్‌ విలువ పెంచాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌లు, తహశీల్దార్లు అధ్యయనం ప్రారంభించారు.

Updated : 19 Jun 2024 02:46 IST

మొదలైన సబ్‌ రిజిస్ట్రార్ల కసరత్తు

న్యూస్‌టుడే, తాండూరు: ప్రభుత్వం భూముల మార్కెట్‌ విలువ పెంచాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌లు, తహశీల్దార్లు అధ్యయనం ప్రారంభించారు. భూముల విలువ పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అయితే ఈ విలువ ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఆదేశాలు రావడంతో ఆమేరకు అధికారులు కసరత్తు చేపడుతున్నారు.

డిమాండ్‌ ఉన్న సర్వే నంబర్ల సేకరణ

జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో ఏరియాను బట్టి వాస్తవ ధరలకు, మార్కెట్‌లో పలుకుతున్న ధరలకు భారీ వ్యత్యాసం ఉంటోంది. ఈ అంతరాన్ని తగ్గించే విధంగా కసరత్తు మొదలు పెట్టారు.

  •  జిల్లాలోని పురపాలిక, మండల, జిల్లా కేంద్రం వికారాబాద్‌తో పాటు ప్రధాన గ్రామాల్లో డిమాండ్‌ ఉన్న సర్వే నంబర్లు ఏవి అనే విషయాన్ని అధికారులు సేకరించే ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. 
  • గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర, జాతీయ రహదారుల వారగా వ్యవసాయేతరానికి అనువైన ప్రాంతాలు, పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.   తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్‌ పట్టణాల్లో డిమాండ్‌ ఉన్న ప్రాంతాలను గుర్తించి స్థలాలకు విలువ కట్టబోతున్నారు.

నివేదికను కమిటీకి అందిస్తారు

ఈ నెలాఖరు వరకు ఏ సర్వే నంబర్లోని భూమికి ఎంత విలువ పెంచాలనే విషయంలో ఓ నిర్ణయానికి వచ్చి నివేదికను జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఉండే కమిటీకి అందజేస్తారు. ఈ కమిటీ అభ్యంతరాలు స్వీకరిస్తుంది. సమస్యలను పరిష్కరించాక మార్కెట్‌ విలువ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా చేసి ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్లను అమలు చేస్తారు.

పరిహారం విషయంలో ఆందోళన

భారాస ప్రభుత్వం 2020-21ల రాష్ట్రంలో భూములకు తక్కువ ధరలు ఉన్న ప్రదేశాల్లో 50 శాతం, ఎక్కువ వుంటే 30 శాతం, మధ్యస్తంగా ఉన్న భూములకు 40శాతం చొప్పున ధరలు పెంచింది.

 జిల్లాలో రహదారులు, ఇతర నిర్మాణ ప్రదేశాల్లో భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వం రికార్డుల్లో పేర్కొన్న మేరకు విలువను బట్టి పరిహారం చెల్లించడానికి నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇది సదరు భూ యజమానులకు నప్పక న్యాయస్థానాలను ఆశ్రయించడంతో నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. 

22న సమర్పించాల్సి ఉంటుంది

భూముల మార్కెట్‌ విలువ పెంపునకు సంబంధించి ఈనెల 22న ప్రాథమిక నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆమేరకు సబ్‌ రిజిస్ట్రార్లు కసరత్తు ప్రారంభించారు.- అన్వర్, తాండూరు సబ్‌రిజిస్ట్రార్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని