logo

ప్రత్యేక పరీక్ష.. మహిళకు ఆరోగ్య రక్ష

Updated : 19 Jun 2024 02:47 IST

ఆదరణ పొందుతున్న మంగళవారం వైద్య కేంద్రాలు
న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్, పరిగి

మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. దీన్లో భాగంగా 2023లో ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా కొత్తగా ‘ఆరోగ్య మహిళా పథకం’ ప్రారంభించింది. దీనికింద ప్రతి మంగళవారం గుర్తించిన ఆసుపత్రుల్లో మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేయడం మొదలు పెట్టారు. అవసరమైతే పెద్దాసుపత్రులకు సిఫారసు చేస్తున్నారు. మొదట్లో పెద్దగా ఆదరణ కనిపించక పోయినా ప్రస్తుతం పరీక్షలకు వచ్చే వారి సంఖ్య బాగా పెరిగింది.

అందుబాటులో నిపుణులైన వైద్య సిబ్బంది

జిల్లాలోని గుర్తించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం నిపుణులైన మహిళా డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, నోటి, రొమ్ము క్యాన్సర్,  థైరాయిడ్, సూక్ష్మ పోషకాల లోపాల గుర్తింపు, అయోడిన్‌ సమస్య, ఫోలిక్‌ యాసిడ్‌ పరీక్ష, ఐరన్‌ లోపం, విటమిన్‌ బి12 లోపం, విటమిన్‌ డీ లోపం పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నారు. మూత్రకోశ సంక్రమణ వ్యాధులు, మోనోపాజ్‌ పరీక్షలు, నెలసరి సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి వైద్యంతో పాటు అవగాహన కల్పిస్తున్నారు. చికిత్సలు అవసరం ఉన్న మహిళలను వికారాబాద్‌ ఆసుపత్రులకు, ఇంకా అవసరమైతే గాంధీ, నిమ్స్‌ వంటి ప్రభుత్వ ఆసుపత్రులకు సిఫారసు చేస్తున్నారు. మందులు సూచిస్తున్నారు.

మొదట్లో కేవలం 2000 మంది

ఈ పథకం ప్రారంభించిన దాదాపు ఆరు నెలల వరకు నిర్దేశిత కేంద్రాలకు పరీక్షల నిమిత్తం వచ్చే మహిళల సంఖ్య 2000కు దాటేది కాదు. అలాంటిది ప్రస్తుతం 20,000కు దాటిపోయింది.

  • గతేడాది జూన్‌ 20 నుంచి ఈ సంవత్సరం మే 28 వరకు 52 మంగళవారాలు పరీక్షలు జరిపారు.
  • 8 కేంద్రాల్లో పరీక్షల కోసం వచ్చిన వారు: 21,833
  • పరీక్షలు చేయించుకుంది: 21,668
  • థైరాయిడ్‌: 2273
  • విటమిన్‌ డి: 915
  • రొమ్ము క్యాన్సర్‌ అనుమానితులు: 1486
  • నోటి క్యాన్సర్‌ అనుమానితులు: 984

నియోజకవర్గానికి ఒక పీహెచ్‌సీ కేటాయింపు

ప్రారంభంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ః ఆరు నెలల క్రితం మరో 5 కేంద్రాల్లో ధారూర్, యాలాల్, బంట్వారం, కోట్‌పల్లి, చన్‌గోముల్‌ ప్రారంభించారు.  

వికారాబాద్‌.. రామయ్యగూడ
తాండూరు.. యాలాల  
పరిగి..    దోమ
కొడంగల్‌.. సీహెచ్‌సీ

అందరూ సద్వినియోగం చేసుకోవాలి: డాక్టర్‌ సాయిబాబా, జిల్లా కార్యక్రమ అధికారి

జిల్లాలో 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక శ్రద్ధతో మహిళా వైద్యులే వచ్చి పరీక్షిస్తారు. వ్యాధి తగ్గే వరకు సూచనలు, సలహాలు ఇస్తారు. దీనిని జిల్లాలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. 

అన్ని పీహెచ్‌సీలకూ విస్తరించే యోచన

‘మహిళా ఆరోగ్య పథకం’ కార్యక్రమాన్ని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు విస్తరించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఇందుకోసం మహిళా ఎంపీహెచ్‌ఎస్‌లకు శిక్షణ కూడా ఇచ్చారు. జిల్లాలో 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటన్నింటిలో సేవలు ప్రారంభించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని