logo

అద్దెకు అగ్నిమాపక వాహనాలు

పెళ్లి వేడుకకు పెద్దఎత్తున జనాలు హాజరవుతున్నారా..? మీ ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నారా..? మైదానాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారా..? అయితే అక్కడ అగ్నిప్రమాదాల నివారణకు ఫైరింజన్లను అద్దెకు తీసుకోవచ్చు.

Updated : 19 Jun 2024 03:19 IST

సభలు, సమావేశాలు, వేడుకలకు సేవలు

ఈనాడు, హైదరాబాద్‌: పెళ్లి వేడుకకు పెద్దఎత్తున జనాలు హాజరవుతున్నారా..? మీ ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నారా..? మైదానాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారా..? అయితే అక్కడ అగ్నిప్రమాదాల నివారణకు ఫైరింజన్లను అద్దెకు తీసుకోవచ్చు. గంటలు, రోజుల చొప్పున అద్దె చెల్లించి సేవలు పొందొచ్చు. ఇప్పటికే నుమాయిష్, ఎల్బీస్టేడియంలో జరిగే వేడుకలు, సభలకు వాహనాలను(స్టాండ్‌ బై వెహికిల్స్‌) అద్దెకిస్తూ అగ్నిమాపకశాఖ ఆదాయం సమకూర్చుకుంటోంది. 2010 సెప్టెంబర్‌లో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు 253 మేరకు అగ్నిమాపకశాఖ సేవలందిస్తోంది.

పంపింగ్‌ సేవలు కూడా.. నీటి పైపులు పగిలిపోయి, ఇతర సందర్భాల్లో లోతట్టు ప్రాంతాల్లో వరద చేరితే కూడా అగ్నిమాపకశాఖ సేవలను వినియోగించుకోవచ్చు. గేటెడ్‌ కమ్యూనిటీలు, లోతట్టు ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్‌ల నిర్వాహకులు నీటిని తోడేందుకు పెద్దమొత్తంలో ఖర్చు చేస్తుంటారు. వారు తక్కువ ఛార్జీలతో అగ్నిమాపకశాఖ సేవలు పొందొచ్చు. పంపింగ్‌ సేవల(నీటిని తోడే)కు గంటకు రూ.2వేలు, రోజుకైతే రూ.20,000 ఛార్జీ ఉంది. కార్నివాల్, నుమాయిష్, ఎల్బీస్టేడియంలో మ్యాచ్‌లు, సభలు, వివాహ, ఇతర వేడుకలకు, సినిమా షూటింగులకు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు.

ఛార్జీలు ఎలా ఉన్నాయి?.. వాహనం పంపే స్టేషన్‌ నుంచి ప్రదర్శన, వేడుక, సమావేశం జరుగుతున్న వేదిక వరకు కిలోమీటరుకు రూ.20 చొప్పున ప్రత్యేకంగా చెల్లించాలి. నాన్‌ ప్రాఫిట్, ప్రాఫిట్‌ సేవల ఆధారంగా గంటకు రూ.1500- రూ.2000, రోజుకు రూ.15000- రూ.20,000 వరకు చెల్లించాలి. అదే పంపింగ్‌ సేవలకైతే గంటకు రూ.750 నుంచి రూ.1000 చెల్లించాలి. పెళ్లి వేడుకల వద్ద గంటకు రూ.3000, రోజుకు రూ..30,000 చెల్లించాలి. పంపింగ్‌ సేవలకు గంటకు రూ.1500 చెల్లించాలి. సినిమా షూటింగ్‌లలో పంపింగ్‌కు గంటకు రూ.2వేలు, రోజుకు రూ.20వేలు, స్టాండ్‌ బై వెహికిల్‌ సేవలకు గంటకు రూ.3వేలు, రోజుకు రూ.30వేలు చెల్లిస్తున్నారు. విస్తృతంగా పంపింగ్‌ సేవలు అందించేందుకు అగ్నిమాపకశాఖ ఇటీవలే 8 అధునాతన పంపులను కొనుగోలు చేసింది. మరిన్ని వివరాలకు https://fire.telangana.gov.in/WebSite/standby.aspx వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.

ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవడమే..

ఈ సేవలకు ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకోవాలి. స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘బుక్‌ ఫైర్‌స్టాండ్‌ బై వెహికిల్‌’పై క్లిక్‌ చేయాలి. అక్కడ రిజిస్టర్‌పై క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేసి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేసుకోవాలి. లాగిన్‌ తర్వాత వెహికిల్‌ స్టాండ్‌ బై అప్లికేషన్‌ను క్లిక్‌ చేసి కేటగిరీ, పేరు, చిరునామా, మొబైల్‌ నంబర్, ఎప్పటి నుంచి సేవలు అవసరం సంబంధించిన వివరాలను సబ్‌మిట్‌ చేయాలి. డబ్బు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఈ దరఖాస్తును ఏడీఎఫ్‌వో, డీఎఫ్‌వో, ఆర్‌ఎఫ్‌వో అధికారులు పరిశీలించి అనుమతి జారీ చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని