logo

20 ఏళ్ల కుర్రాళ్లు.. డ్రగ్స్‌ దందాలో ఆరితేరారు

జల్సాలకు అలవాటుపడ్డ ఓ కుర్రాడు చోరీలు చేశాడు. మత్తుకు బానిసై ఖర్చులకు డ్రగ్‌ పెడ్లర్‌ అవతారం ఎత్తాడు.

Published : 19 Jun 2024 01:27 IST

మాట్లాడుతున్న సీపీ తరుణ్‌జోషి. చిత్రంలో డీసీపీలు, ఏసీపీ

ఈనాడు, హైదరాబాద్, వనస్థలిపురం, న్యూస్‌టుడే: జల్సాలకు అలవాటుపడ్డ ఓ కుర్రాడు చోరీలు చేశాడు. మత్తుకు బానిసై ఖర్చులకు డ్రగ్‌ పెడ్లర్‌ అవతారం ఎత్తాడు. బెంగళూరులో తక్కువ ధరకు కొని ఎక్కువకు విక్రయిస్తున్న అతడిని ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి డ్రగ్స్‌ కొంటున్న మరొకరూ చిక్కారు. నిందితుల నుంచి రూ.4 లక్షల విలువైన 26 గ్రాముల ఎండీఎంఏ, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌వోటీ డీసీపీ మురళీధర్, డీసీపీ పద్మజతో కలిసి రాచకొండ కమిషనర్‌ తరుణ్‌జోషి మంగళవారం హైదరాబాద్‌లో వివరాలు వెల్లడించారు. హయత్‌నగర్‌ శ్రీనివాసకాలనీకి చెందిన అత్తాపురం భరత్‌రెడ్డి (21) జల్సాలకు అలవాటుపడి బీటెక్‌ మధ్యలోనే ఆపేశాడు. విదేశాలకు వెళ్లి స్థిరపడాలని కలలు కన్నా చెడు అలవాట్లతో సాధ్యపడలేదు. దీంతో జల్సాల కోసం దొంగతనాలు చేయడంతో హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్లలో 4 చోరీ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. రెండు డ్రగ్స్‌ కేసులు నమోదైనా తీరు మార్చుకోలేదు. ఇతని స్నేహితుడు వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన చిక్యాల విఖ్యాత్‌(19) కూడా డ్రగ్స్‌ అలవాటుపడ్డాడు. డబ్బు సరిపోకపోవడం, డ్రగ్స్‌ మంచి డిమాండ్‌ ఉండడంతో ఇద్దరూ ఎక్కువ ధరకు అమ్మాలనుకున్నారు. బెంగళూరులో రూ.1200 ఒక గ్రాము చొప్పున ఎండీఎంఏ కొని హైదరాబాద్‌కు తీసుకొచ్చి రూ.4 వేల చొప్పున విక్రయించేవారు. ఈనెల 16న ఇద్దరూ బెంగళూరు వెళ్లి 26 గ్రాముల ఎండీఎంఏ కొన్నారు. హైదరాబాద్‌ వచ్చాక విఖ్యాత్‌ ఇంట్లో డ్రగ్స్‌ దాచారు. హయత్‌నగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి టి.హేమంత్‌కుమార్‌ డ్రగ్స్‌ కోసం వీరిని సంప్రదించాడు. సోమవారం రాత్రి వనస్థలిపురం ఠాణా పరిధిలో హేమంత్‌కు భరత్‌రెడ్డి, విఖ్యాత్‌ డ్రగ్స్‌ విక్రయిస్తుండగా సమాచారం అందుకున్న ఎస్‌వోటీ ఎల్బీనగర్‌ పోలీసులు పట్టుకున్నారు.


ఇంటి అద్దెకు యజమానురాలి వేధింపులు
ఉరేసుకుని కిరాయిదారు బలవన్మరణం

వరప్రసాద్‌

నిజాంపేట, న్యూస్‌టుడే: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఓ వ్యక్తిని అద్దె డబ్బుల కోసం ఇంటి యజమానురాలు వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండల కేంద్రానికి చెందిన దాసరి వరప్రసాద్‌ (45), శైలజ దంపతులు కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. బాచుపల్లి సాయినగర్‌ పరిధిలోని ఆదిత్య గార్డెన్స్‌లో నివాసం ఉంటున్నారు. వరప్రసాద్‌ స్థిరాస్తి వ్యాపారం చేస్తుండగా.. భార్య గృహిణి. వారికి కళాశాల విద్య అభ్యసిస్తున్న కుమారుడు ఉన్నాడు. వరప్రసాద్‌కు ఇటీవల ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. దీంతో తాను ఉంటున్న ఇంటికి అద్దె డబ్బులు మూడు నెలలుగా కట్టడం లేదు. ఈ నెల 15న భార్య కుమారుడు పోచారంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. దీంతో అతను ఒంటరిగా ఉన్నాడు. అద్దె డబ్బుల కోసం యజమానురాలైన లక్ష్మీనర్సమ్మ శనివారం సాయంత్రం వరప్రసాద్‌కు ఫోన్‌ చేసి పరుషంగా దూషించారు. దాంతో మానసికంగా కుంగిపోయిన అతను దూషించిన ‘కాల్‌ రికార్డింగ్‌’ సంభాషణను సోమవారం సాయంత్రం భార్యకు పంపించి బాధపడ్డాడు. మంగళవారం పలుమార్లు వరప్రసాద్‌కు భార్య ఫోన్‌ చేసినా తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె కుమారుడితో సహా ఇంటికి వచ్చి చూడగా భర్త గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందాడు. మృతుడి భార్య శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంటి యజమానురాలిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.రమేష్‌ తెలిపారు.


బైక్‌ రేసింగ్‌.. ఆరుగురి అరెస్టు

పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు

రాయదుర్గం, న్యూస్‌టుడే: బైకుల రేసింగ్‌ కేసులో ఆరుగురు యువకులను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానానికి రిమాండ్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆకతాయిలు ఈనెల 16న రాత్రి రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని టీహబ్, సత్వా, అర్వింత్‌ గెలాక్సీ రోడ్లపైకి చేరుకుని బైకులపై రేసింగ్, విన్యాసాలు చేస్తుండగా రాయదుర్గం పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. అక్కడ పోకిరీలు వదిలేసి వెళ్లిన పది ద్విచక్రవాహనాలను సీజ్‌ చేశారు. ఆ వాహనాల వివరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. రేసింగ్‌లకు పాల్పడిన అబ్దుల్‌ మతిన్, చిటుకుల సాయికిరణ్, చప్పిడి శరణ్, నాయిని భానుచందర్, ఈశ్వర్‌ కుమార్, కొటారి కృష్ణలను అరెస్టు చేశారు. మిగతా నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిన త్వరలోనే పట్టుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.


స్క్రూడ్రైవర్‌తో బ్యూటీషియన్‌పై దాడి

చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: పెళ్లి చేసుకోబోయే యువతిపై అనుమానంతో వ్యక్తి స్క్రూడ్రైవర్‌తో దాడి చేసి, గొంతు నులిమి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం ఛత్రినాక ఠాణా పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి వివరాల ప్రకారం.. కందికల్‌ ఎస్‌ఆర్‌టీ కాలనీకి చెందిన బ్యూటీషియన్‌ శ్రావ్య(24)కు 2019లో అర్షద్‌ అనే వ్యక్తితో పెళ్లైంది. భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తడంతో తల్లి శారదతో కలిసి ఎస్‌ఆర్‌టీ కాలనీలో ఉంటోంది. విడాకులకు దరఖాస్తు చేసింది. అబిడ్స్‌లో ఫుడ్‌ కోర్ట్‌ నిర్వహించే హరిబౌలి ప్రాంతానికి చెందిన బంధువు మణికంఠ(30)తో శ్రావ్య సన్నిహితంగా ఉంటోంది. తనను పెళ్లి చేసుకోవాలని మణికంఠ శ్రావ్యను కోరడంతో అంగీకరించింది. అయితే విడాకులు వచ్చాక చేసుకుందామంది. ఆమె తరచుగా ఇతరులతో ఫోన్‌లో మాట్లాడుతుండడంతో తనను కావాలనే దూరం పెడుతోందని యువకుడు భావించాడు. మంగళవారం ఉదయం జిమ్‌కు వెళ్లి వస్తున్న శ్రావ్యను మణికంఠ అనుసరించి ఆమె ఇంటికి వచ్చాడు. ఆమె ఫోన్‌లో మాట్లాడుతుండడంతో ఎవరితో మాట్లాడుతున్నావంటూ నిలదీశాడు. నువ్వు ఎవరు నన్ను అడగడానికి అంటూ ఆమె అనడంతో వాగ్వాదం జరిగింది. ఆగ్రహం చెందిన మణికంఠ గది తలుపులు, కిటీకీలు మూసివేసి అక్కడే ఉన్న స్క్రూడ్రైవర్‌తో దాడి చేసి విచక్షణ రహితంగా పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు అక్కడకు చేరుకుని పక్కనే ఉన్న పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. గమనించిన మణికంఠ శ్రావ్యను గొంతు నులిమి హత్య చేయడానికి యత్నించాడు. పోలీసులు చేరుకుని ఇంటి తలుపులు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించగా మణికంఠ కత్తిపీటతో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రావ్య ఛాతి, ముఖంపై గాయాలవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.


చిన్నారుల అక్రమ రవాణా కేసులో మరో ఐదుగురి పాత్ర
మహారాష్ట్ర జైల్లో నిందితులు.. పీటీ వారెంటు దాఖలు

ఈనాడు, హైదరాబాద్‌: మేడిపల్లి పోలీసులు చేధించిన చిన్నారుల అక్రమ రవాణా రాకెట్‌లో రాచకొండ పోలీసులు ముఠాను అరెస్టు చేశారనే సమాచారంతో దర్యాప్తు ప్రారంభించిన మహారాష్ట్ర సీఐడీ ఆ రాష్ట్రంలో 12 మంది నేరగాళ్లను అరెస్టు చేసి 9 మంది చిన్నారుల్ని రక్షించారు. ఆ 12 మందిలో ఐదుగురు నిందితులకు.. తెలంగాణలో చిన్నారులకు అక్రమ రవాణా రాకెట్‌తో సంబంధమున్నట్లు మేడిపల్లి పోలీసులు గుర్తించారు. రిమాండులో ఉన్నవారిని పీటీ వారెంటు మీద ఇక్కడికి తీసుకొచ్చేందుకు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మరో ముగ్గురు చిన్నారుల విక్రయానికి సంబంధించిన సమాచారం మేడిపల్లి పోలీసులకు అందడంతో వారిని రక్షిస్తామని కమిషనర్‌ తరుణ్‌జోషి ప్రకటించారు. ఈ కేసులో తాజాగా మరో నిందితుడిని అరెస్టు చేశారు. దిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణెలో ఉండే కన్నయ్య ఆచూకీకి పోలీసులు వెతుకుతున్నారు. ముఠా తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, దిల్లీలో కార్యకలాపాలు సాగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని