logo

న్యూజిలాండ్‌ వీసాల పేరిట మోసం

విద్యా, ఉద్యోగాల వీసాలతో న్యూజిలాండ్‌కు పంపిస్తామని రూ.లక్షలాది వసూలు చేసిన ఘరానా మోసంపై మలక్‌పేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

Published : 19 Jun 2024 01:20 IST

సైదాబాద్‌: విద్యా, ఉద్యోగాల వీసాలతో న్యూజిలాండ్‌కు పంపిస్తామని రూ.లక్షలాది వసూలు చేసిన ఘరానా మోసంపై మలక్‌పేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సై జయంత్‌ కథనం ప్రకారం.. మూసారాంబాగ్‌ డివిజన్‌ అండాళ్‌ నిలయం సమీపంలోని ఓ భవనంలో మహబూబ్‌నగర్‌కు చెందిన గండి కిరణ్‌కుమార్‌.. డేగా డెస్టినేషన్‌ కన్సల్టెన్సీ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ నిర్వహిస్తున్నాడు. స్టూడెంట్‌ వీసా, వర్క్‌ పర్మిట్‌ వీసా, ఇమిగ్రేషన్‌ వీసా, విజిట్‌ వీసాలపై న్యూజిలాండ్‌కు పంపిస్తామని ప్రచారం చేయడంతో, నిజమని నమ్మిన విద్యార్థులు, నిరుద్యోగులు.. నగదు చెల్లించారు. రూ.4 నుంచి రూ.5 లక్షల చొప్పున 16 మంది నుంచి రూ.70 లక్షల వరకు వసూలు చేశాడు. జులై 15న న్యూజిలాండ్‌ పంపుతానని నమ్మించాడు. అందరికీ వీసా ఆఫర్‌ లెటర్లు అందజేశాడు. ఈ నెల 10న తాను న్యూజిలాండ్‌కు వెళ్లి ఏర్పాట్లు చేసి.. పిలుస్తానని చెప్పాడు. అనంతరం ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో ఉంది. కార్యాలయ సిబ్బందిని అడిగితే, పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో.. మోసపోయామని గ్రహించారు. బాధితురాలు మంజుల ఆధ్వర్యంలో పలువురు మలక్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేసింది. గండి కిరణ్‌కుమార్‌తో పాటు సంస్థలో పని చేస్తున్న ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని