logo

జల్సాలకు అలవాటుపడి దోపిడీలు

ఆ ముగ్గురు మైనర్లే.. అయితే జల్సాలకు అలవాటుపడ్డారు. గంజాయి, మద్యానికి బానిసలయ్యారు. దారిదోపిడీకి పాల్పడి నారాయణగూడ పోలీసులకు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకొని జువైనల్‌ హోమ్‌కు తరలించారు.

Published : 19 Jun 2024 01:23 IST

జువైనల్‌ హోమ్‌కు ముగ్గురు మైనర్ల తరలింపు

వివరాలు వెల్లడిస్తున్న సుల్తాన్‌బజార్‌ ఏసీపీ కె.శంకర్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఆ ముగ్గురు మైనర్లే.. అయితే జల్సాలకు అలవాటుపడ్డారు. గంజాయి, మద్యానికి బానిసలయ్యారు. దారిదోపిడీకి పాల్పడి నారాయణగూడ పోలీసులకు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకొని జువైనల్‌ హోమ్‌కు తరలించారు. సెల్‌ఫోన్, ద్విచక్రవాహనం, కత్తి, రెండు టాటూ మిషన్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం నారాయణగూడ ఠాణాలో వివరాలు ఇన్‌స్పెక్టర్‌ యు.చంద్రశేఖర్, డీఐ డి.నాగార్జునలతో కలిసి సుల్తాన్‌బజార్‌ ఏసీపీ కె.శంకర్‌ వివరాలు వెల్లడించారు. జగిత్యాల పట్టణం గుళ్లపేటకు దమ్మా దినేష్‌రెడ్డి హైదరాబాద్‌ నారాయణగూడలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ హిమాయత్‌నగర్‌లోని బర్గర్‌ కింగ్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 13న తెల్లవారుజామున విధులు ముగించుకొని హాస్టల్‌కు వెళుతుండగా హిమాయత్‌నగర్‌ వీధి నంబరు 11 సిటీ కెఫే వద్ద ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు అడ్డుకున్నారు. ముందు డబ్బులు అడిగితే లేేవని చెప్పడంతో సెల్‌ఫోన్‌ ఇవ్వమన్నారు. ఇవ్వకుంటే దాడి చేశారు. కత్తి తీసి చంపేస్తామని బెదిరించి చరవాణి లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో నారాయణగూడ, సుల్తాన్‌బజార్, అఫ్జల్‌గంజ్‌ పోలీసులు మంగళవారం అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. బొల్లారానికి చెందిన ఏ1 (17), ఏ3 (15) బాల్య స్నేహితులు. ఏ1 జువైనల్‌ హోమ్‌లో ఉండగా గతంలో వారాసిగూడ ఠాణా పరిధిలో అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్న ముషీరాబాద్‌కు చెందిన ఏ2 (17) పరిచయమయ్యాడు. హోమ్‌ నుంచి వచ్చిన తరువాత ముగ్గురూ జతకట్టారు. ఓ బాలుడు వాహనం కావాలని పట్టుబడితే అతని తల్లి తన పుస్తెలతాడు అమ్మి కొనిచ్చింది. అదే వాహనంపై ఈ ముగ్గురు కలిసి స్నాచింగ్‌లు, దారిదోపిడీలు చేస్తున్నట్లు గుర్తించారు.  వీరు గతంలో బొల్లారంలో టాటూ వేయించుకుని ఆ యంత్రాలతోపాటు ఇతర సామగ్రిని చోరీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని