logo

ఉండాల్సింది 55 ఉన్నది 80

జూబ్లీహిల్స్‌ నివాసిత ప్రాంతంలో విపరీతమైన శబ్ద కాలుష్యం నమోదవుతోంది. నిర్మాణ కార్యకలాపాలు, డీజేల హోరు, వాహనాల రాకపోకలే ఇందుకు కారణమని తెలుస్తుంది.

Published : 19 Jun 2024 01:35 IST

జూబ్లీహిల్స్‌లో విపరీతమైన శబ్ద కాలుష్యం
ఈనాడు, హైదరాబాద్‌

జూబ్లీహిల్స్‌ నివాసిత ప్రాంతంలో విపరీతమైన శబ్ద కాలుష్యం నమోదవుతోంది. నిర్మాణ కార్యకలాపాలు, డీజేల హోరు, వాహనాల రాకపోకలే ఇందుకు కారణమని తెలుస్తుంది. 65 డెసిబుల్స్‌ శబ్ద తీవ్రత దాటితే గుండె జబ్బులు, చెవుడు వచ్చే ప్రమాదం ఉందని కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరిస్తుంటే.. మార్చి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ అంతకు మించి శబ్ద తీవ్రత పెరుగుతోంది. పీసీబీ నివేదిక ప్రకారం మార్చిలో ఉదయం 68.4, రాత్రి వేళ 63.7, ఏప్రిల్‌లో ఉదయం 76.6, రాత్రి 83.2, మేలో ఉదయం 80.8, రాత్రి 79.5 డెసిబుల్స్‌ నమోదైంది. 

నాలుగు ప్రాంతాలుగా విభజించి..

నగరంలోని పరిశ్రమలు, నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, వాణిజ్య ప్రదేశాలను పరిగణలోకి తీసుకొని పీసీబీ శబ్ద పరిమితులు నిర్ధారించింది. జూబ్లీహిల్స్, తార్నాకలను నివాస ప్రాంతాలుగా గుర్తించింది. ఇక్కడ ఉదయం 50 డెసిబుళ్లు, రాత్రి 40 డెసిబుళ్ల శబ్దతీవ్రత మించొద్దు. తార్నాకలోనూ పరిమితికి మించి శబ్ద తీవ్రత నమోదవుతోంది. మేలో ఇక్కడ ఉదయం 60.4, రాత్రి 49.4గా నమోదైంది. వాణిజ్య ప్రాంతాలైన అబిడ్స్, జేఎన్టీయూ, ప్యారడైజ్‌లో ఉదయం 65, రాత్రి 55 డెసిబుళ్లుగా ఉండాలి. జేఎన్టీయూలో ఉదయం 68.4, రాత్రి 65 డెసిబుళ్లుగా నమోదైంది. పారడైజ్‌లో 67.2, 67.5 డెసిబుళ్లుగా నమోదైంది. సనత్‌నగర్, జీడిమెట్ల, గడ్డపోతారాలను పారిశ్రామిక ప్రాంతాలుగా గుర్తిస్తూ ఉదయం 75, రాత్రి 70 డెసిబుల్స్‌గా నిర్దేశించింది. ఇక్కడ 65 డెసిబుళ్లకు మించి నమోదవ్వకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. సున్నిత ప్రాంతాలైన జూపార్కు, గచ్చిబౌలిలో ఉదయం 50, రాత్రి 40 డెసిబుళ్లకు మించి శబ్దాలు ఉండకూడదు.జూపార్కులో కాస్త అటు ఇటుగా శబ్ద తీవ్రత నమోదైనా, గచ్చిబౌలిలో ఉదయం 59.1, రాత్రి 57.3 నమోదైంది.

శబ్దం హద్దు మీరితే...

శబ్దం మితిమీరితే గుండె కొట్టుకునే వేగం, రక్తపీడనం పెరుగుతుంది. ః 65 డెసిబుల్స్‌ దాటితే గుండె జబ్బులు, చెవుడు రావొచ్చు.   ః పని చేసే శక్తిని కోల్పోతారు. నిద్ర పట్టదు. తలనొప్పి, అలసట వస్తుంది. ః మానసికంగా, శారీరకంగా మనిషి కుంగిపోతాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని