logo

అక్రమ కనెక్షన్లకు యాప్‌తో చెక్‌

గ్రేటర్‌ వ్యాప్తంగా  పెరుగుతున్న అక్రమ తాగునీటి, మురుగు కనెక్షన్లకు యాప్‌తో చెక్‌ పెట్టేందుకు జలమండలి సిద్ధమైంది.

Published : 19 Jun 2024 01:39 IST

ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మక పరిశీలన

గ్రేటర్‌ వ్యాప్తంగా  పెరుగుతున్న అక్రమ తాగునీటి, మురుగు కనెక్షన్లకు యాప్‌తో చెక్‌ పెట్టేందుకు జలమండలి సిద్ధమైంది. ఇప్పటికే కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఈ యాప్‌ను విజయవంతంగా పరిశీలించిన అధికారులు త్వరలో నగర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. కొన్నేళ్లుగా అక్రమ నల్లాలు, మురుగు నీటి కనెక్షన్ల వల్ల జలమండలికి తీవ్ర నష్టం జరుగుతోంది. కొన్ని డివిజన్లలో కిందిస్థాయి సిబ్బందే అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారు. కొన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలకు కూడా అక్రమ మురుగు కనెక్షన్లున్నాయి. ఇలాంటి వాటిని యాప్‌తో అరికట్టవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు.

ఎలా పనిచేస్తుందంటే...

  •  గ్రేటర్‌ వ్యాప్తంగా 15 లక్షల వరకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి.  నల్లా, మురుగు కనెక్షన్ల వివరాలు, వాటి క్యాన్‌ నెంబర్ల సమాచారం మొత్తం యాప్‌తో అనుసంధానమై ఉంటాయి. జీపీఎస్‌తో ఎక్కడ ఏయే ఇళ్లు, అపార్ట్‌మెంట్, వాణిజ్య, వ్యాపార సంస్థ ఉన్నాయి.. వాటి క్యాన్‌ నెంబర్లు యాప్‌ ద్వారా ఇట్టే తెలుస్తుంది.  
  • ఏదైనా ప్రాంతానికి వెళ్లి అక్కడ యాప్‌ ఓపెన్‌ చేయగానే ఆ చుట్టుపక్కల ఇళ్లు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, క్యాన్‌ నెంబర్లు కనిపిస్తాయి. ఒకవేళ కనిపించకపోతే అక్కడ అధికారిక నల్లా లేదా మురుగు కనెక్షన్‌ లేనట్లే.
  • దీంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలిస్తారు. ఇటీవల కూకట్‌పల్లిలో ఒక పెద్ద వ్యాపార సముదాయానికి మురుగు కనెక్షన్‌ లేకపోగా పక్కనే ఉన్న నివాస సముదాయాలకు కలిపినట్లు గుర్తించారు. వెంటనే యజమానికి అధికారులు నోటీసులు జారీ చేశారు.
  • తొలుత పెద్దపెద్ద వ్యాపార సంస్థలు, అపార్ట్‌మెంట్లను యాప్‌తో పరిశీలించనున్నారు. వీటి లెక్క తేలిన తర్వాత నోటీసులిచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.
  •  ప్రస్తుతం జలమండలి సేవలు అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు విస్తరించాయి. 1400 చ.కి.మీ. పరిధిలో 80 లక్షల మందికి తాగునీటిని అందిస్తోంది. గ్రేటర్‌ వరకు నెలకు 20 వేల లీటర్లు ఉచితంగా ఇస్తోంది. అయినా చాలామంది అధికారికంగా నల్లాలను తీసుకోవడం లేదు. అక్రమాలకు పాల్పడుతున్నారు. వారికి సిబ్బంది సహకరిస్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని