logo

పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ తీసుకుంటే.. బడిలోంచి పంపించేశారు!

ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ (బోనఫైడ్‌) తీసుకుంటే సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏకంగా బడి రిజిస్టర్‌లోంచి పేరు తొలగించి విద్యార్థిని అనుమతించని సంఘటన బుధవారం జరిగింది.

Published : 20 Jun 2024 00:58 IST

తాండూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ (బోనఫైడ్‌) తీసుకుంటే సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏకంగా బడి రిజిస్టర్‌లోంచి పేరు తొలగించి విద్యార్థిని అనుమతించని సంఘటన బుధవారం జరిగింది. తాండూరు మండలం ఉద్దండాపూర్క్‌ు చెందిన బీజే.శరత్‌ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల కుల, ఆదాయ ధ్రువపత్రం పొందేందుకు దరఖాస్తు చేశాడు. దీనికి బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ జత చేయాల్సి రావడంతో ప్రధానోపాధ్యాయులు శర్మను అడిగారు. మూడు రోజుల క్రితం ఆయన దాన్ని విద్యార్థికి అందజేశారు. ఎప్పటిమాదిరి విద్యార్థి బుధవారం బడికి వెళ్లగా ప్రధానోపాధ్యాయులు గమనించి ‘పాఠశాల దస్త్రాల్లోంచి నీ పేరు తొలగించడం జరిగింది..నీవు ఇంటికి వెళ్లిపో’ అంటూ బయటకు పంపించాడు. దీంతో విద్యార్థి విషయాన్ని తండ్రి రాములుకు ఏడుస్తూ వివరించాడు. వెంటనే అతను పాఠశాలకు వెళ్లి తన కుమారుడిని ఎందుకు పంపించావని ఆరా తీశారు. మీరు బోనఫైడ్‌ తీసుకున్నరోజే పాఠశాల దస్త్రాల నుంచి పేరు తొలగించానని, తిరిగి చేర్చుకునేదిలేదంటూ బదులిచ్చాడు. మేము టీసీ తీసుకోలేదు కదా అని, అనుమతించాలని తండ్రి బతిమాలినా ‘చేర్చుకోను’ అంటూ వాగ్వాదానికి దిగాడు. గత్యంతరంలేక సదరు విద్యార్థి, తండ్రి ఉసూరుమంటూ ఇంటికి వెళ్లిపోయారు. విషయం తెలియడంతో  గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విద్యార్థిని తిరిగి బడిలో చేర్చుకొని, ప్రధానోపాధ్యాయుడిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని