logo

ప్రీలాంచింగ్‌ పేరిట స్థిరాస్తి సంస్థ మోసం

సెంటు భూమి లేకుండానే సొంత ఇల్లు, విల్లాలంటూ ఆశ చూపించి రూ.కోట్లు వసూలు చేసి ముఖం చాటేశారు. నగరంలో మరో ప్రీలాంచింగ్‌ మాయాజాలం వెలుగు చూసింది.

Published : 20 Jun 2024 01:04 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: సెంటు భూమి లేకుండానే సొంత ఇల్లు, విల్లాలంటూ ఆశ చూపించి రూ.కోట్లు వసూలు చేసి ముఖం చాటేశారు. నగరంలో మరో ప్రీలాంచింగ్‌ మాయాజాలం వెలుగు చూసింది. నగర శివార్లతోపాటు పలు జిల్లాల్లో అయిదు గృహ నిర్మాణ ప్రాజెక్టులంటూ జీఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థ భారీ మోసానికి తెగబడినట్టు బాధితులు వాపోతున్నారు. విల్లాలు, అపార్ట్‌మెంట్‌ల నమూనాలతో ఆకర్షణీయంగా ముద్రించిన కరదీపికలను చూపించడంతో పెద్ద మొత్తంలో చెల్లించామంటూ బాధితులు బుధవారం నగర సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల పక్షాన రాఘవేంద్ర మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 10లోని నిర్మలమ్మ భవనంలోని రెండో అంతస్తులో జి.శ్రీనివాసరావు ‘జీఎస్‌ఆర్‌ గ్రూప్స్‌’ పేరిట స్థిరాస్తి సంస్థను ప్రారంభించాడు. డైరెక్టర్లుగా అతడి భార్య పద్మజ, కుమారుడు వంశీ, కుమార్తె డాక్టర్‌ అనూష, వంశీకృష్ణ, శిల్ప శ్రీలు వ్యవహరించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనను చూసి, కొందరు ఏజెంట్ల ద్వారా జీఎస్‌ఆర్‌ సంస్థను సంప్రదించారు. కొల్లూరు, మోకిలా, యాదాద్రి, కామకోలులో రకరకాల ప్రాజెక్టులంటూ మభ్యపెట్టారు. రూ.లక్ష పెట్టుబడితో ఏడాదిలో రెండింతలు చేస్తామంటూ ఒప్పంద పత్రం అందజేశారు. బాధితులు ఆయా ప్రాజెక్టుల వద్దకు వెళ్లి చూస్తే వేరే ఇతర స్తిరాస్థి సంస్థల వెంచర్లు కనిపించాయి. గట్టిగా నిలదీస్తే డబ్బు తిరిగి ఇచ్చేస్తామని చెక్కులు ఇచ్చారు. కొందరికి తమ ప్రాజెక్టును మరో సంస్థకు అప్పగించామంటూ ఏమార్చారు. వారిని సంప్రదిస్తే తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారన్నారు. అనంతరం బాధితులు జూబ్లిహిల్స్‌ ఠాణాలో ఫిర్యాదు చేశామని ఓ బాధితుడు పేర్కొన్నారు. కేసును హైదరాబాద్‌ సీసీఎస్‌కు బదిలీ చేశారన్నారు. ఒకొక్కరు రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు చెల్లించినట్టు ఆవేదన వెలిబుచ్చారు. శ్రీనివాసరావు, అతని కుటుంబ సభ్యులు ముందస్తు బెయిల్‌ తీసుకొని, బయట ప్రపంచానికి కనిపించడం లేదన్నారు. ఇంటి వద్దకు వెళ్లి డబ్బులు అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని