logo

ఇరుకు దారుల్లోనే చిరు వ్యాపారాలు

ప్రణాళిక లేకుండా నగరం విస్తరిస్తోంది. ఇళ్లు నిర్మించిన తర్వాత రహదారులు వేయడం, మురుగు నీటి వ్యవస్థ, తాగునీటి సౌకర్యం కల్పించడం తదితర అంశాల్లో ప్రణాళికాబద్ధంగా నిర్మాణమవడం లేదు.

Updated : 20 Jun 2024 04:39 IST

నగర రహదారుల్లో నిత్యం ట్రాఫిక్‌ జామ్‌లు
ఈనాడు, హైదరాబాద్‌

ప్రణాళిక లేకుండా నగరం విస్తరిస్తోంది. ఇళ్లు నిర్మించిన తర్వాత రహదారులు వేయడం, మురుగు నీటి వ్యవస్థ, తాగునీటి సౌకర్యం కల్పించడం తదితర అంశాల్లో ప్రణాళికాబద్ధంగా నిర్మాణమవడం లేదు. దీంతో ఇరుకు రహదారుల్లో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. పార్కులు లేక స్వచ్ఛమైన గాలిని పీల్చుకోలేకపోతున్నారు. నివాసాలకు తగ్గ వ్యాపార సముదాయాలు సమకూరడం లేదు. దీంతో కూరగాయల దుకాణాలు, పండ్ల వ్యాపారాలు, తోపుడు బండ్లు రహదారిని ఆక్రమిస్తున్నాయి. వారాంతపు సంత వస్తే మొత్తం రహదారులే బంద్‌ అయిపోతున్నాయి. ఇందుకు చక్కటి ఉదాహరణలు.. మణికొండ, కూకట్‌పల్లి వివేకానందనగర్‌ కాలనీ, ఇజ్జత్‌నగర్, కొత్తగూడ చౌరస్తా, ఎర్రగడ్డ-సనత్‌నగర్‌ రహదారి, హైటెక్‌ సిటీ పరిసరాలు. ఇప్పుడివే ట్రాఫిక్‌ పోలీసులకు, బల్దియా సిబ్బందికి ఆదాయవనరుగా మారుతున్నాయి. ప్రతి ఒక్కరి నుంచి డబ్బులు దండుకుని ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. 

వాహదారుల అవస్థలు..

నివాసం ఉంటున్నవారి సంఖ్య.. వారి వాహనాల వినియోగం.. ఇలా ఏ అంశాలు పరిగణనలోకి తీసుకోకుండా.. అడ్డగోలు ఇంటి నిర్మాణాలకు అనువుగా రహదారులు నిర్మిస్తున్నారు. ఒకప్పుడు వ్యక్తిగత ఇళ్లు ఉంటే.. ఇప్పుడు అక్కడ ఆకాశమే హద్దుగా అపార్టుమెంట్లు వెలుస్తున్నాయి. నాలుగైదు కుటుంబాలుండే స్థలంలో 40అంతస్తులు కడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా సాగే చిరు వ్యాపారాలు, దుకాణ సముదాయాలు రోడ్డును ఆక్రమించేస్తున్నాయి. రహదారులకు ఇరువైపులా వ్యాపారాలు లేకుండా నిషేధించాలని, తోపుడు బండ్లకు లైసెన్సులు మంజూరు చేసి వారికి తగిన స్థలం కేటాయించాలని నగరవాసులు కోరుతున్నారు.

వసతులు పట్టించుకోకుండా..

కాలనీలో పార్కులు, వ్యాపార కేంద్రాలు, వారాంతంపు సంతలు, చిరు వ్యాపారాలు సాగడానికి స్థలాన్ని కేటాయించాలి.. వంటి వాటిని పట్టించుకోకుండా బల్దియా, హెచ్‌ఎండీఏ అనుమతులు మంజూరు చేయడం.. డబ్బులు దండుకోవడం చేస్తున్నారు. ఎర్రగడ్డ రహదారిపై ఫుట్‌పాత్‌లు ఆక్రమణలను తొలగించే సాహసం కూడా బల్దియా చేయలేని దుస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి కాలనీలో కొంతమేర ప్రభుత్వ స్థలం ఉండాల్సింది పోయి.. ఉన్నవి కూడా అమ్ముకుని సొమ్ము చేసుకునే ప్రభుత్వ సంస్థలు ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. షేక్‌పేట నాలా నుంచి ఉస్మానియా కాలనీ, మణికొండ ప్రాంతాల్లో 47ఎల్‌ రూటు నంబరు బస్సు అవస్థలు వర్ణనాతీతం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని