logo

అధునాతన చెత్తదిబ్బ.. పనులు నత్తనడక

వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో అధునాతన చెత్త దిబ్బ నిర్మాణానికి 2021లో శ్రీకారం చుట్టారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.3.82 కోట్లు అప్పుడే మంజూరు చేసింది.

Updated : 20 Jun 2024 04:27 IST

రూ.3.28 కోట్ల ప్రాజెక్టు 

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ: వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో అధునాతన చెత్త దిబ్బ నిర్మాణానికి 2021లో శ్రీకారం చుట్టారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.3.82 కోట్లు అప్పుడే మంజూరు చేసింది. దీంతో సంవతరాలుగా పట్టి పీడిస్తున్న చెత్త సమస్య  తీరుతుందని అనుకుంటే ప్రజల ఆశలు నిరాశలయ్యాయి. పనులకు శ్రీకారం చుట్టినా, పలు కారణాలతో గుత్తేదారు అసంపూర్తిగా వదిలేశారు. కనీసం ఇప్పుడైనా పట్టించుకోవాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

10 ఎకరాల స్థలం కేటాయింపు

ఆధునిక హంగులతో నిర్మించ తలపెట్టిన చెతదిబ్బ కోసం టీయూ ఎఫ్‌ఐడీఎస్‌ నుంచి రూ.1.50 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నుంచి మరో రూ.2.32 కోట్లు విడుదలయ్యాయి. వికారాబాద్‌ గంగారం రైౖల్వే పట్టాలు దాటిన తర్వాత జైదుపల్లి గ్రామానికి వెళ్లే దారిలో పురపాలక స్థలంలో 10 ఎకరాల్లో చెత్త దిబ్బ నిర్మాణం చేపట్టారు. ముందుగా చుట్టూ ప్రహరీ నిర్మించారు. లోపల కొద్ది దూరం వరకు సిమెంట్‌ రోడ్డు వేశారు. తరువాత ఇతర పనులేవీ జరగలేదు. షెడ్ల నిర్మాణ పనుల కోసం బేస్‌మెంట్‌ వరకు నిర్మించి వదిలేశారు. ఇక్కడ మూడు షెడ్లను నిర్మించాల్సి ఉంది. తడి చెత్తకు, పొడి చెత్తకు వేర్వేరుగా షెడ్లను నిర్మిస్తారు. తడి, పొడి చెత్తను వేరు చేసే యంత్రం ఏర్పాటు కోసం మరో షెడ్డును నిర్మించాలి. ప్రతిదీ 30 మీటర్ల పొడవు, 20 మీటర్లు వెడల్పుతో ఉంటుంది. సిబ్బంది కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు, వాచ్‌మన్‌ ఉండటానికి గదిని నిర్మించాలి. పచ్చదనం కోసం అందమైన మొక్కలను నాటాలి. నీటి సౌకర్యం కోసం బోరు వేశారు. 

19 రకాల చెత్తను వేరు చేస్తుంది

ఇక్కడ ఏర్పాటుచేసే చెత్త వేరు చేసే యంత్రం విలువ రూ.కోటి ఉంటుంది. ఇది 19 రకాల పొడి చెత్తను వేరు చేస్తుంది. పట్టణంలో వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన పొడి చెత్తను ఈ యంత్రంలో వేస్తే వేరు చేసి బయట పడేస్తుంది. దీంతో కార్మికులకు పని తగ్గుతుంది. ఇక్కడే చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేయాలి. కానీ ఆ పనులేవీ ఇక్కడ జరగడంలేదు. పట్టణంలో సేకరించిన చెత్తను ఇక్కడికి తరలించి కుప్పలుగా పోస్తున్నారు. కాల్చివేస్తున్నారు. దీంతో పొగ వ్యాపించి వాయు కాలుష్యం పెరిగిపోతోందని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు.


త్వరలోనే ప్రారంభిస్తాం 

- జాకీర్‌ అహ్మద్, కమిషనర్, పురపాలక సంఘం, వికారాబాద్‌. 

చెత్త దిబ్బ పనులు మధ్యలో నిలిపివేశారు. నిర్మాణానికి కావాల్సిన ముడి సరకు ధరలు పెరగటంతో గుత్తేదారు పనులు ఆపేశారు. ఇక్కడ మూడు షెడ్లు నిర్మించాలి. రెండు నిర్మించి యంత్రాన్ని తెప్పించే ఆలోచన ఉంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని