logo

కరుణించని మేఘం.. కర్షకుడు అయోమయం

వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వానా కాలం వచ్చిందన్నట్లుగా వారం క్రితం తొలకరి పలకరించడంతో సంతోషంగా విత్తనాలు విత్తుకున్నారు. తరువాత వరుణుడు మొహం చాటేశాడు.

Published : 20 Jun 2024 01:25 IST

న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్, దౌల్తాబాద్, కొడంగల్, వికారాబాద్‌ గ్రామీణ

వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వానా కాలం వచ్చిందన్నట్లుగా వారం క్రితం తొలకరి పలకరించడంతో సంతోషంగా విత్తనాలు విత్తుకున్నారు. తరువాత వరుణుడు మొహం చాటేశాడు. ఇప్పటివరకు చినుకు జాడే లేకుండా పోవడంతో అన్నదాత్లో ఆందోళన మొదలైంది. వర్షాలు లేకపోతే ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటలే ఆధారమని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితులపై ‘న్యూస్‌టుడే’ కథనం.

పత్తి సాగుపైనే ఎక్కువ దృష్టి

జిల్లాలో వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్‌ నియోజక వర్గాలుండగా నల్లరేగడి నేలలతో పాటు చెల్క నేలలు కూడా ఉన్నాయి. చెల్క నేలలు కలిగిన వారు సరిపడా తేమ లేక ఇప్పటివరకు విత్తనాలు వేసుకోలేదు. వారంతా నింగికేసి నిరీక్షిస్తున్నారు. ఇతర పంటల కంటే  ప్రధానంగా పత్తి సాగు పట్ల దృష్టి సారించారు. విత్తుకున్న ప్రాంతాల్లో లేత మొక్కలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో వర్షాలు కురిస్తే బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల తుంపర సేద్యంతో నీటి తడులను అందిస్తున్నారు.  

వారంలో పడకుంటే మళ్లీ విత్తుకోవాల్సిందే..

వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇతర పంటలను సాగు చేసుకుందామంటే వర్ష సూచన కనిపిస్తోంది. దీంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే అప్పులు చేశామని మరోసారి విత్తుకోవడం తమకు తలకుమించిన భారమని వాపోతున్నారు. నల్లరేగడి నేలలు అధికంగా ఉండటంతో మొలకలు నాలుగైదు రోజుల వరకు తట్టుకుంటాయి. అప్పటికే వర్షాలు రాకపోతే మళ్లీ విత్తుకోవాల్సిందేనని వ్యవసాయ శాఖ చెబుతోంది. నిత్యం సాయంత్రం కాగానే మబ్బులు పట్టి ఉంటున్న ఆకాశం సాయంత్రానికి తేలిపోతోంది. వెరసి రైతులు నిరాశ చెందుతున్నారు.  ః వర్షాభావం కొనసాగినా జులై రెండో వారం వరకు విత్తనాలు విత్తుకునేందుకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


మొలక రావడం లేదు 

- సాయప్ప, రైతు, దౌల్తాబాద్‌

దాదాపు రూ.14వేలు పెట్టుబడి పెట్టి నాలుగు ఎకరాల్లో కంది విత్తనాలు విత్తుకున్నాం. మొలకెత్తుతున్న దశలో వర్షాలు పడటం లేదు. దీంతో భూమిలో ఉన్న మొలక వంగిపోయి ఎర్రబారుతోంది. వాన రాకుంటే మళ్లీ విత్తుకోవాల్సి వస్తుందేమోనన్న భయం వెంటాడుతోంది.


బిందు, తుంపర సేద్యంపై ఆధారపడవచ్చు

- గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి

వర్షాలు పడే అవకాశం ఇంకా ఉంది. కాబట్టి వారం రోజుల పాటు వేచి చూడాల్సిందే. నెల రోజుల వయసు కలిగిన మొలకలు అయితే యూరియా రెండు శాతం పిచికారీ చేస్తే బెట్టను తట్టుకుంటాయి. వారం వ్యవధి కావడంతో ఎలాంటి చర్యలు చేపట్టకూడదు. నీటి సదుపాయం కలిగిన రైతులు బిందు, తుంపర సేద్యాన్ని వినియోగించవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని