logo

నకిలీ బీమా ఉంటే.. తప్పించుకోలేరు

ఉత్తుత్తి వాహన బీమాకు రవాణాశాఖ చెక్‌ పెట్టనుంది. ఇప్పటివరకు యథేచ్ఛగా జరుగుతున్న ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని అధికారులు నిర్ణయించారు.

Updated : 20 Jun 2024 04:38 IST

ఐఆర్‌డీఏతో అనుసంధానించేందుకు రవాణాశాఖ చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: ఉత్తుత్తి వాహన బీమాకు రవాణాశాఖ చెక్‌ పెట్టనుంది. ఇప్పటివరకు యథేచ్ఛగా జరుగుతున్న ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని అధికారులు నిర్ణయించారు. త్వరలో ఇన్సూరెన్సు రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఆర్‌డీఏ)తో పూర్తి స్థాయిలో అనుసంధానించేందుకు యోచిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ప్రతి వాహనానికి బీమా తప్పనిసరి. ఆటోలు, బస్సులు, స్కూల్‌ వాహనాలకు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్సు తప్పకుండా తీసుకోవాలి. ఏటా ఆటోలు, బస్సులు, మినీ బస్సులు, క్యాబ్‌లు లాంటివి ఫిట్‌నెస్‌కు వచ్చిన సందర్భాల్లో బీమా తప్పకుండా పరిశీలించాలి. ఆటో నుంచి మినీ వాహనానికి రూ.10 వేల వరకు ప్రీమియం చెల్లించి బీమా పొందాలి. ఈ ప్రీమియంను తప్పించుకోవడానికి కొందరు అడ్డదారుల్లో వెళుతున్నారు. కొందరు నకిలీ బీమా పత్రాలను ఫిట్‌నెస్‌ సందర్భంలో అందిస్తున్నారు. మరికొందరు నెలరోజుల కోసం బీమా తీసుకుంటున్నారు. చాలా కంపెనీలు ఏడాది కాలానికి బీమా ఇస్తుంటాయి. దీనిపై కనీసం పరిశీలించకుండానే కొందరు  ఏడాది కాలానికి ఫిట్‌నెస్‌ ఇస్తున్నారు. 

పరిశీలన లేకుండానే..ప్రస్తుతం మార్కెట్‌లో అనేక బీమా కంపెనీలు వాహన బీమా పాలసీలను విక్రయిస్తున్నాయి. ఇవి ఐఆర్‌డీఏ పరిధిలో పనిచేస్తుంటాయి. రవాణాశాఖ వెబ్‌సైట్‌లో ఇప్పటివరకు ఐఆర్‌డీఏతో అనుసంధానం లేకపోవడంతో నకిలీ బీమా ధ్రువీకరణలు గుర్తించడం కష్టమవుతోంది. డ్రైవర్లు సమర్పించిన బీమా పత్రం సరైనదా...కాదా...అని పరిశీలించే అవకాశం లేదు. ఏ కార్యాలయంలోనూ ఇది పక్కాగా సాగడం లేదు. దీంతో బీమా పత్రం కన్పిస్తే చాలు...అది అసలదా...నకిలీదా అని చూడకుండానే ఫిట్‌నెస్‌ జారీ చేస్తున్నారు. ఏదో కంపెనీ పేరుతో తప్పుడు బీమా నెంబరు లేదంటే ఇది వరకే నమోదు చేసిన ఇన్సూరెన్సు నెంబరును మళ్లీ నమోదు చేసినా సరే పట్టించుకోకుండా మమ అనిపిస్తున్నారు. ఇక నుంచి ఈ మోసాలకు అడ్డుకట్ట పడనుంది. ఐఆర్‌డీఏతో అనుసంధానం చేయడం వల్ల ఏ కంపెనీ బీమా తీసుకున్నా సరే...పరిశీలన సమయంలో తెలిసిపోతుంది. ఒకవేళ నకిలీ ధ్రువీకరణలు సమర్పిస్తే అక్కడికక్కడే గుర్తించే వీలుంది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని