logo

ఉస్మానయా వంటశాల

ఉస్మానియా బోధనాసుపత్రిలో కార్పొరేటుకు ధీటుగా పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. రూ.14 కోట్లతో నూతన ఎంఆర్‌ఐ(మాగ్నటిక్‌ రెసొనెన్స్‌ ఇమేజింగ్‌) యంత్రం ఏర్పాటు చేశారు.

Published : 20 Jun 2024 01:32 IST

రూ.14 కోట్లతో ఎంఆర్‌ఐ యంత్రం ఏర్పాటు 
వైద్యారోగ్యశాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభం రేపు
న్యూస్‌టుడే, ఉస్మానియా ఆసుపత్రి

స్మానియా బోధనాసుపత్రిలో కార్పొరేటుకు ధీటుగా పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. రూ.14 కోట్లతో నూతన ఎంఆర్‌ఐ(మాగ్నటిక్‌ రెసొనెన్స్‌ ఇమేజింగ్‌) యంత్రం ఏర్పాటు చేశారు. 20 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో తొలిసారిగా ఇక్కడ దాన్ని ఏర్పాటు చేశారు. శరీరంలోని అతి సూక్ష్మమైన వ్యాధి లక్షణాలు, అవయవాల పనితీరును స్పష్టంగా గుర్తిస్తుంది. యంత్రం ద్వారా ఎంతో మంది రోగులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. యంత్రంపై పని ఒత్తిడి పెరగడంతో కొన్నేళ్ల క్రితం అది మూలకు పడింది. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాన్ని టీఎస్‌ఎంఐడీసీ సహకారంతో కొనుగోలు చేశారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నట్లు సూపరింటెండెంట్‌ డా.నాగేందర్‌ తెలిపారు. అంతేకాకుండా ఓపీలో ఆధునికీకరించిన ఏఆర్‌టీ (యాంటీ రెట్రో వైరల్‌ ట్రీట్‌మెంట్‌) కేంద్రాన్ని కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. 

పౌష్టికాహారం అందజేస్తూ..

వివిధ వ్యాధులతో బాధపడుతూ చికిత్స నిమిత్తం దవాఖానాలో చేరే రోగులకు మందులు, వైద్యం ఎంత అవసరమో.. నాణ్యమైన పౌష్టికాహారం అందించడం అంతే ముఖ్యం. బలవర్థక ఆహారంతో రోగులు త్వరగా కోలుకునే ఆస్కారం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వైద్యుల సూచన మేరకు ఆహార నిపుణులు(డైటీషియన్ల) స్వీయ పర్యవేక్షణలో ఇన్‌పేషెంట్లకు ఉస్మానియాలో నాణ్యమైన ఆహారం పంపిణీ చేస్తున్నారు. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన వంటశాల పురాతనమైంది. టీఎస్‌ఎంఐడీసీ ఆధ్వర్యంలో దాన్ని ఆరు నెలల క్రితం రూ.2 కోట్లతో ఆధునికీకరించారు. ప్రస్తుతం పనులు పూర్తయ్యాయి. అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కార్పొరేటుకు ధీటుగా దాన్ని ఆధునికీకరించారు. ఇన్‌పేషెంట్లతో పాటు ఇక్కడ విధులు నిర్వర్తించే వైద్యులకు సైతం ఈ వంటశాలలోనే అల్పాహారం, భోజనం తయారు చేస్తుంటారు. ఆహారం నమలలేని రోగులకు ద్రవ రూపంలోనూ తయారు చేసి అందించడం ప్రత్యేకత. రోగుల వ్యాధులు, వ్యాధి తీవ్రతను బట్టి వైద్యుల సూచన మేరకు పోషకాలతో కూడిన ఆహారం తయారు చేస్తున్నారు.


మెరుగైన వైద్యసేవలు అందజేస్తున్నాం

 - డా.నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా  

కార్పొరేట్‌కు ధీటుగా మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నాం. ఇన్‌పేషంట్లకు నాణ్యమైన పౌష్టికాహారం ఇస్తున్నాం. హైప్రోటీన్, లిక్విడ్, జనరల్, రీనల్, కార్డియాక్, సెమిసాలిడ్‌ వంటి ఆహారం ఎంత మందికి పంపిణీ చేస్తున్న విషయమై ఆహార పట్టికలో పొందుపరుస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు