logo

పనోళ్లుగా చేరి.. ఇళ్లల్లో చోరీ

సికింద్రాబాద్‌లోని నగల వ్యాపారి ఇంట్లో పనివాళ్లుగా చేరిన నేపాలీ దంపతులు రూ.25-30లక్షల విలువైన వజ్రాభరణాలు కొట్టేశారు.

Updated : 20 Jun 2024 04:37 IST

నగరంలో ఇంటి దొంగల చేతివాటం
5 నెలల్లో 40కి పైగా కేసుల నమోదు
ఈనాడు, హైదరాబాద్, రాంనగర్, న్యూస్‌టుడే

సికింద్రాబాద్‌లోని నగల వ్యాపారి ఇంట్లో పనివాళ్లుగా చేరిన నేపాలీ దంపతులు రూ.25-30లక్షల విలువైన వజ్రాభరణాలు కొట్టేశారు. పక్కా పథకంతో ఇంట్లోకి చేరి నమ్మకంగా ఉంటూనే యజమాని కుటుంబం ముంబయి వెళ్లగానే అందినంత దోచుకొని పారిపోయారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. జూబ్లీహిల్స్‌లోని వ్యాపారి నివాసంలో రూ.70లక్షల విలువైన సొత్తు మాయమైంది. ఇదంతా పనిమనుషుల చేతివాటమంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. తాజాగా గగన్‌మహల్‌లో విశ్రాంత ఉద్యోగికి కేర్‌టేకర్‌గా చేరిన యువకుడు.. ఏటీఎం కార్డులు తీసుకొని రూ.30లక్షలు కాజేశాడు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నిందితుడికి మతిస్థిమితం సరిగాలేదంటూ వైద్యుల నుంచి పొందిన సర్టిఫికెట్‌ ఆధారంతో పోలీసులు రాజీపడమంటూ ఒత్తిడి తెస్తున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. 


పోలీసులు చెప్పినా.. పెడచెవిన

నివాళ్లుగా చేరి అందినంత దోచుకున్న కేసుల్లో ఇవి ఉదాహరణలు మాత్రమే. ఈ ఏడాది నగరంలో  5 నెలల వ్యవధిలో ఈ తరహా చోరీలు/మోసాలపై 40కు పైగా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌లో పనిమనుషులకు విపరీతమైన డిమాండ్‌. ఇతర రాష్ట్రాలకు చెందిన వారైతే 24 గంటలు అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో యజమానులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. పనిలో కుదుర్చుకునే ముందుగానే వారి వ్యక్తిగత వివరాలు, నేరచరిత్రపై ఆరా తీయడం, ఆధార్, ఫోన్‌నెంబర్లు తీసుకోవాలని పోలీసులు పలుమార్లు సూచించినా అధికశాతం పెడచెవిన పెడుతున్నారు. హాక్‌-ఐ యాప్‌లో వివరాలు నమోదు చేస్తే తామే వారి పుట్టుపూర్వోత్తరాలు రాబడతామని సూచించినా తేలికగా తీసుకుంటున్నారు. ఇల్లు గుల్లయ్యాక పోలీసులను ఆశ్రయిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 


ఇప్పుడేం జరుగుతుందంటే?

గరంలోని సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన కుటుంబాలు అధికశాతం ముంబయి, దిల్లీ, యూపీ, బిహార్, నేపాల్‌ తదితర ఇతర ప్రాంతాల వాళ్లను పనికి కుదుర్చుకుంటాయి. తక్కువ జీతంతో ఎక్కువ పని చేస్తారనే ఉద్దేశంతో యజమానులు ఏరికోరి వీళ్లనే ఎంపిక చేసుకుంటారు. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు దిల్లీ ముఠాలు రంగంలోకి దిగుతాయి. నేపాల్, బిహార్‌కు చెందిన యువకులు, మహిళలకు కమీషన్‌ ఆశచూపుతారు. ప్రయాణఛార్జీలు, రోజువారీ ఖర్చులతో హైదరాబాద్‌ పంపుతారు. ఇక్కడ వ్యాపార, సంపన్న కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తారు. పనివాళ్లు అవసరమైన ఇళ్లల్లోకి చేరి ఉపాధి చూపమంటూ కోరతారు. క్రమంగా ఇళ్లలో పాగా వేసి అదను కోసం ఎదురు చూస్తారు. యజమాని కుటుంబం దూర ప్రాంతాలకు వెళ్లగానే ఇంట్లో దొరికినంత దోచుకొని రాత్రికి రాత్రే దిల్లీ చేరతారు. అక్కడ ముఠాలకు బంగారు ఆభరణాలు అందజేసి సొంతూళ్లకు చేరతారు. చేతికొచ్చిన సొమ్ముతో విలాసవంతంగా జీవిస్తున్న వీరిని గమనించిన యువకులు నేరబాట పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్నాయి. కష్టార్జితం ఇంటిదొంగల పాలవకుండా ఉండేందుకు జాగ్రత్తగా ఉండటమే పరిష్కారమని పోలీసులు సూచిస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని