logo

కబ్జా చేద్దాం.. కలిపేసుకుందాం

హైదరాబాద్‌లోని మణికొండ ఐటీ కారిడార్‌ సమీపంలో వెంచర్‌ వేసేందుకు ప్రైవేటు భూములు చాలక కొందరు పట్టాభూములకు సమీపంలోని నాలా బఫర్‌ జోన్‌ను తమ భూముల్లో కలిపేసుకుంటున్నారు.

Updated : 20 Jun 2024 04:40 IST

బుల్కాపూర్‌ నాలా ఆక్రమణకు రియల్టర్ల యత్నం

ఈనాడు, హైదరాబాద్, షేక్‌పేట్, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని మణికొండ ఐటీ కారిడార్‌ సమీపంలో వెంచర్‌ వేసేందుకు ప్రైవేటు భూములు చాలక కొందరు పట్టాభూములకు సమీపంలోని నాలా బఫర్‌ జోన్‌ను తమ భూముల్లో కలిపేసుకుంటున్నారు. షేక్‌పేట్‌ నుంచి ఓయూ కాలనీలోకి ప్రవేశించే వంతెన పక్కన ఉన్న బుల్కాపూర్‌ నాలా ఆక్రమణ కొన్ని నెలలుగా యథేచ్ఛగా సాగుతోంది. దీని విలువ రూ.100కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఈ నాలాకు సమీపంలో రియల్‌ వెంచర్లు నిర్మిస్తున్న కొందరు బఫర్‌ జోన్‌ నిబంధనలకు విరుద్ధంగా నాలా రక్షణ గోడకు సమీపంలో కంచె నిర్మిస్తున్నారు. ఇప్పటికే నాలాకు కొన్ని అడుగుల దూరం వరకు కంచె నిర్మాణం పూర్తి చేశారు. మిగతా భాగంలో ఇనుప రేకులు ఏర్పాటు చేసేందుకు రాడ్లు అమర్చారు. నాలాకు సమాంతరంగా 30 అడుగుల వెడల్పు, 300 మీటర్ల పొడవునా ఈ ఆక్రమణ కొనసాగుతోంది. చుట్టుపక్కల భారీస్థాయిలో బహుళ అంతస్తుల భవనాలు, రెండు, మూడు కి.మీ.ల దూరంలో గేటెడ్‌ కమ్యూనిటీలు ఉండటంతో అపార్ట్‌మెంట్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

ఎవరికి వారే...

ఒకప్పుడు సహజనీటి వనరుగా పేరున్న బుల్కాపూర్‌ నాలాను ప్రైవేటు వ్యక్తులు, రియల్‌ వెంచర్ల ప్రతినిధులు సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. షేక్‌పేట్, గండిపేట్‌ మండలాల పరిధుల్లోని ఓయూకాలనీ, నార్సింగి, ఖానాపూర్, మణికొండ పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న ఈ నాలాను ఎవరికివారు ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుంటున్నారు. భారీ వెంచర్లకు అవసరమైన స్థలాన్ని కబ్జాచేసి ఆ ప్రాంతంలో గడ్డి, పూలమొక్కలు నాటి సుందరీకరించి ప్రహరీ కడుతున్నారు. నాలా ఆక్రమణ నిజమేనంటూ రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలు నిర్ధారించినా ఇప్పటివరకు వాటిని తొలగించలేకపోయారు. ఇరిగేషన్‌ అధికారుల పరిధిలోకి వస్తుందంటూ రెవెన్యూ అధికారులు తప్పించుకోగా... ఇరిగేషన్‌ అధికారులు మాత్రం మా దృష్టికి రాలేదని, వెంటనే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు