logo

గోల్కొండ ఖిల్లా.. ఆక్రమణలే నిలువెల్లా

ఆక్రమణలతో గోల్కొండ ఖిల్లా ప్రతిష్ఠ మసకబారుతోంది. ఆనాటి పాలకులు శత్రుదుర్భేధ్యంగా నిర్మించిన దుర్గం ప్రహరీ కబ్జాలతో కనుమరుగైపోతోంది.

Updated : 20 Jun 2024 04:37 IST

ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, గోల్కొండ: ఆక్రమణలతో గోల్కొండ ఖిల్లా ప్రతిష్ఠ మసకబారుతోంది. ఆనాటి పాలకులు శత్రుదుర్భేధ్యంగా నిర్మించిన దుర్గం ప్రహరీ కబ్జాలతో కనుమరుగైపోతోంది. అయినా పురావస్తుశాఖ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తుండటం గమనార్హం. వీటికి నల్లా, విద్యుత్‌ కనెక్షన్లు జారీ చేస్తూ జలమండలి, జీహెచ్‌ఎంసీ, విద్యుత్తు అధికారులు... పరోక్షంగా ఆక్రమణలను ప్రోత్సహిస్తున్నారు. తొలుత తాత్కాలిక షెడ్లు వేస్తున్న ఆక్రమణదారులు నెమ్మదిగా అక్కడే శాశ్వతంగా కాంక్రీట్‌ నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికి తోడు కోట చుట్టూ జంతు కళేబరాలు, వ్యర్థాలు పారేస్తూ, మూత్రవిసర్జన చేస్తూ అసౌకర్యం కలిగిస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే...‘గోల్కొండ కోటకు వారసత్వ హోదా’ కలలాగే మిగిలిపోనుందని చరిత్రకారులు వాపోతున్నారు. 

రోడ్డుకు ఇరువైపులా.. ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా పురావస్తుశాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. జలమండలి, జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు తప్పనిసరి. ఫతేదర్వాజ నుంచి ప్రధాన ద్వారం వరకు గమనిస్తే.. రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు వెలిశాయి. 

హోదాకి అడ్డంకి.. 2012లోనే ప్రభుత్వం ప్రపంచ వారసత్వ హోదా కోసం నివేదిక తయారు చేయించి కేంద్ర పురావస్తుశాఖ ద్వారా యునెస్కోకు పంపింది. యునెస్కో బృందం గోల్కొండను పరిశీలించి కొన్ని సూచనలు చేసింది. ఆక్రమణలు తొలగించాలని, కోట ఆవరణలో ఉన్న ఆధునిక కట్టడాలను తొలగించాలని, ప్రభుత్వం మేనేజ్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ సూచనలు పాటించి మళ్లీ నివేదిక తయారు చేసి ఇస్తేనే యునెస్కో గుర్తింపు లభించే అవకాశం ఉండగా ఆక్రమణలు కలవరపెడుతున్నాయి.


చట్టం ఏం చెబుతోంది.. ప్రాచీన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాల చట్టం - 2010 సెక్షన్‌ 20-ఎ ప్రకారం కట్టడం నుంచి 100 మీటర్ల మేర చుట్టూ నిషేధిత ప్రాంతంగా గుర్తించాలి. సెక్షన్‌ 20-బి ప్రకారం రక్షిత ప్రాంతం నుంచి 200 మీటర్ల మేర అన్ని దిశల్లో విస్తరించిన ప్రాంతాన్ని నియంత్రిత ప్రాంతంగా (రెగ్యులేటింగ్‌ ఏరియా)గా గుర్తించాలి. అంటే 300 మీటర్ల పరిధిలో గోల్కొండ కోట చుట్టూ నిర్మాణాలు చేపట్టకూడదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని