logo

మూడు నెలలకోసారి.. రూ.300 కోట్లు

బ్యాంకు రుణాలు బల్దియాను భయపెడుతున్నాయి. రూ.7వేల కోట్ల నిధులు సమీకరించడం వరకు బాగానే ఉన్నా.. వాటిని తీర్చే సమయం మొదలవడంతో అధికారులు వణికిపోతున్నారు.

Updated : 20 Jun 2024 04:26 IST

జీహెచ్‌ఎంసీ చెల్లించాల్సిన రుణ వాయిదాలు
మొదలైన ఈఎంఐలు రూ.7వేల కోట్లకు చేరిన అప్పులు
ఈనాడు, హైదరాబాద్‌

బ్యాంకు రుణాలు బల్దియాను భయపెడుతున్నాయి. రూ.7వేల కోట్ల నిధులు సమీకరించడం వరకు బాగానే ఉన్నా.. వాటిని తీర్చే సమయం మొదలవడంతో అధికారులు వణికిపోతున్నారు. ఇప్పటివరకు చేసిన అప్పులకు సంబంధించి ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఈఎంఐలు మొదలయ్యాయి. ఈ నెలలో రెండో ఈఎంఐ చెల్లించాల్సి ఉంది. ఖాతాలో మాత్రం నిధులు లేవు. ఇది అధికారులను కలవరపెడుతోంది.

ర్థిక విభాగం ఇకపై మూడు నెలలకోసారి రూ.150కోట్ల వడ్డీ, రూ.150కోట్ల అసలు కలిపి దాదాపు రూ.300కోట్ల ఈఎంఐ చెల్లించాల్సి ఉండటం గమనార్హం. జీహెచ్‌ఎంసీ ఇప్పటికే 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.850 కోట్ల ఆస్తిపన్నును వసూలు చేసింది. మార్చి-2025 వరకు మరో రూ.1100 కోట్లు ఖాతాకు చేరొచ్చని అంచనా. నగర ప్రణాళిక విభాగం ద్వారా మరో రూ.1000 కోట్ల ఆదాయం సమకూర్చవచ్చు. మిగతా చెప్పుకోతగిన ఆదాయ వనరులు జీహెచ్‌ఎంసీ ముందు కనిపించడం లేదు. 

మిగులు నుంచి ఊబిలోకి..

జీహెచ్‌ఎంసీ ఖజానాలో 2016 వరకు రూ.1000కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉండేవి. వాటికి బ్యాంకు ప్రతినెలా చెల్లించే వడ్డీ డబ్బులు ఉద్యోగుల జీతభత్యాలకు సరిపోయేది. ఎస్సార్డీపీ ప్రాజెక్టు కోసం జీహెచ్‌ఎంసీ అప్పులు చేయడం ప్రారంభించిన రోజు నుంచి ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారిందని ఇంజినీర్లు చెబుతున్నారు. ప్రభుత్వం అనేకసార్లు గ్రాంటు రూపంలో నిధులు ఇస్తామని చెప్పిందని, కానీ హామీ అమలుకాకపోవడం వల్ల బల్దియా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వేర్వేరు రూపాల్లో సర్కారు జీహెచ్‌ఎంసీకి చెల్లించాల్సిన రూ.3,759కోట్ల బకాయిలనైనా విడుదల చేయాలని కోరుతున్నారు.


అవసరాలు ఎన్నెన్నో..

  • సీఆర్‌ఎంపీ(రహదారుల సమగ్ర నిర్వహణ కార్యక్రమం), పారిశుద్ధ్యం, ఎస్‌ఎన్‌డీపీ(వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం), కాలనీ రోడ్ల నిర్మాణం వంటి పనులకు ఈ ఏడాదిలో కనీసం రూ.1000 కోట్లు అవసరం. 
  • ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, ఇతర ప్రయోజనాల చెల్లింపునకు మరో 1,500కోట్లు కావాలి. 
  • ఏడాదిగా ఆమోదానికి నోచుకోని గుత్తేదారుల బకాయిలు రూ.1,150 కోట్లు ఉన్నాయి. 
  • పురోగతిలోని ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం) పనులు పూర్తి చేసేందుకు రూ.2,500కోట్లు అవసరం. ఇలా చెప్పుకొంటూ వెళ్తే.. మరో రూ.1000కోట్ల ఖర్చులుంటాయి. దాదాపుగా రూ.3వేల కోట్లు లోటు ఉన్నట్టని నిపుణులు అంచనా వేస్తున్నారు.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని