logo

లండన్‌లో ఉద్యోగమంటూ భారీ టోకరా

విదేశంలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఊదరగొట్టారు. దీంతో ఇది నిజమని భావించిన ఓ వ్యక్తి సంస్థ నిర్వాహకులకు రూ.15.60 లక్షలకుపైగా చెల్లించాడు.

Published : 21 Jun 2024 08:07 IST

నకిలీ నియామక పత్రంతో వెళ్లిన బాధితుడికి ఇక్కట్లు

నిజాంపేట, న్యూస్‌టుడే: విదేశంలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఊదరగొట్టారు. దీంతో ఇది నిజమని భావించిన ఓ వ్యక్తి సంస్థ నిర్వాహకులకు రూ.15.60 లక్షలకుపైగా చెల్లించాడు. తీరా వారిచ్చిన నియామక పత్రాలు తీసుకుని పొరుగు దేశం వెళ్లాక అవి నకిలీవని తెలుసుకుని బాధితుడు లబోదిబోమన్నాడు. బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి నిజాంపేట రెడ్డీస్‌ ఎవెన్యూ ఫ్లాట్‌ నంబరు 24లో సుంకర శ్రీనివాస్‌ (36) ఉంటున్నారు. ఉద్యగం నిమిత్తం గతేడాది ఏప్రిల్‌ 17న ‘క్రియేటివ్‌ వీసా అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌’ సంస్థ సూచన మేరకు చుండ్రు ప్రవీణ్‌రావును సంప్రదించాడు. లండన్‌లోని ఓ సంస్థలో ఉద్యోగం, వీసా ఖర్చులకు డబ్బులు కావాలని ప్రవీణ్‌రావు చెప్పడంతో నవంబరు నెలలో పలు దఫాలుగా రూ.15.60 లక్షలను ప్రవీణ్‌రావు, అతని అనుచరులైన అశోక్, లక్ష్మణ్, కోటిరెడ్డికి శ్రీనివాస్‌ చెల్లించాడు. శ్రీనివాస్‌కు లండన్‌లోని ఓ సంస్థ పేరుతో సీఓఎస్‌ (సర్టిఫికెట్‌ ఆఫ్‌ స్పాన్సర్‌షిప్‌) ఉద్యోగ నియామక పత్రాన్ని ప్రవీణ్‌ మిత్రబృందం అందజేసింది. ఆ పత్రం ఆధారంగా శ్రీనివాస్‌ ఈ ఏడాది జనవరి 21న లండన్‌ వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక వెంట తీసుకెళ్లిన నియామక పత్రం నకిలీదని తెలుసుకున్నాడు. అక్కడి నుంచే పలుమార్లు ప్రవీణ్‌రావు అతని మిత్రులను సంప్రదిస్తే అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లదీశారు. దీంతో విసిగిపోయిన శ్రీనివాస్‌ ఏప్రిల్‌ 14న ఇక్కడికి తిరిగొచ్చి ప్రవీణ్‌ బృందాన్ని నిలదీయగా ‘నీకు ఉద్యోగం రెడీగా ఉంది.. మళ్లీ లండన్‌ వెళ్లు’ అని వారు చెప్పడంతో నిజమేననుకుని ఈనెల 6న లండన్‌ వెళ్లాడు. అక్కడ రెండోసారీ శ్రీనివాస్‌కు పరాభవమే ఎదురైంది. ఈనెల 17న తిరిగొచ్చిన బాధితుడు గురువారం బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు