logo

20 మండలాలకు ఒకే ఒక్క ఎంఈఓ!

పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం ‘మన ఊరు..మన బడి’ పేరిట, ప్రస్తుతం ‘అమ్మ ఆదర్శ పాఠశాలల’ పేరుతో అభివృద్ధి పనులు చేపడుతోంది.

Updated : 21 Jun 2024 06:46 IST

పాఠశాలలపై పర్యవేక్షణ లోపం

న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌: పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం ‘మన ఊరు..మన బడి’ పేరిట, ప్రస్తుతం ‘అమ్మ ఆదర్శ పాఠశాలల’ పేరుతో అభివృద్ధి పనులు చేపడుతోంది. మరోవైపు బడి ఈడు కలిగిన పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ‘బడిబాట’ నిర్వహిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా పాఠశాలల పనితీరును పరిశీలన, పర్యవేక్షించే అధికారులు లేకపోవడంతో నిర్వహణ గాడితప్పుతోంది. 

ఇన్‌ఛార్జులుగా  ప్రధానోపాధ్యాయులు

జిల్లాలోని 20 మండలాలకు 20మంది మండల విద్యాధికారులు (ఎంఈఓ) ఉండాలి. కానీ ఒకే ఒక్కరు మాత్రమే పూర్తిస్థాయి ఎంఈఓగా పనిచేస్తున్నారు. మిగతా మండలాలకు ప్రధానోపాధ్యాయులే ఇన్‌ఛార్జిలుగా వ్యవహరిస్తున్నారు. అదనపు బాధ్యతల కారణంగా వారు ఎటూ న్యాయం చేయలేకపోతున్నామని వాపోతున్నారు. జిల్లా ఉప విద్యాధికారి పోస్టులు కూడా ఖాళీగా ఉండటం శోచనీయం పాఠశాలలు పు:న ప్రారంభమైన నేపథ్యంలో కనీసం ఈ ఏడాదైనా సిబ్బంది భర్తీకి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.  

85వేల మందికి  పైగా విద్యార్థులు

పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో 776 ప్రాథమిక, 116 ప్రాథమికోన్నత, 176 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు ఉండగా సుమారు 85వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఎంఈఓలు లేక పాఠశాలల నిర్వహణ గాడి తప్పుతోందని గతం నుంచి ఫిర్యాదులు అందుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలించి పట్టించుకునే వారు లేకుండా పోయారు. దోమ మండల విద్యాధికారిగా పనిచేస్తున్న హరిశ్చందర్‌ పరిగి, పూడూరు మండలాలకు సైతం అదనపు బాధ్యతలను నిర్వహించాల్సి వస్తోంది. 

పదిలో ర్యాంకు నానాటికీ తీసికట్టు 

పర్యవేక్షణ ప్రభావం ఫలితాలపై పడింది. నెల రోజుల క్రితం వెలువడిన పదో తరగతి ఫలితాలు ఈసారి కూడా నిరాశాజనకంగానే ఉన్నాయి. ఈసారి 13,357 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా కేవలం 8695 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 2022-23 విద్యా సంవత్సరంలో 13,399 పరీక్షలకు హాజరైతే 7967 మంది పాసయ్యారు. గత రెండేళ్లుగా వరుసగా వెనుకబడి పోతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఇరవై ఏళ్లుగా భర్తీలు లేవు 

పి.సత్యనారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, టీయూటీఎఫ్‌

2005లో పదోన్నతులు ఇచ్చారు. ఇరవై ఏళ్లుగా ఎంఈఓ పోస్టులు భర్తీ చేయడం లేదు. పర్యవేక్షణ లోపంతో శాఖాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేగాకుండా పాఠశాల అభివృద్ధికి ప్రధాన అవరోధంగా మారింది. సత్వర నిర్ణయాలకు విపరీత జాప్యం జరగడం కూడా ఫలితాలపై ప్రభావం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పడుతోంది.

ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది 

రేణుకాదేవి, జిల్లా విద్యాధికారిణి

పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పాఠశాలల నిర్వహణలో సమస్యలు రాకుండా ఉండేందుకు సీనియర్‌ ప్రధానోపాధ్యాయులను ఇన్‌ఛార్జిలుగా నియమించాం. ఈసారి పది ఫలితాలపై ముందునుంచే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఉత్తమ ఫలితాలను సాధిస్తాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు