logo

అగ్నిమాపక కేంద్రానికి మహర్దశ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో అగ్నిమాపక కేంద్రాలకు మహర్దశ పట్టబోతోంది. నిధులు కేటాయించి సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

Published : 21 Jun 2024 04:29 IST

చెట్ల నీడన యంత్రం 

న్యూస్‌టుడే, కొడంగల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో అగ్నిమాపక కేంద్రాలకు మహర్దశ పట్టబోతోంది. నిధులు కేటాయించి సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. వీటిలో కొడంగల్, కొత్తకోట, జడ్చర్ల, మక్తల్‌తో పాటు మరికొన్ని కేంద్రాలకు సంబంధించి రూ.28 కోట్లు కేటాయించారు. ఆయా ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ అధికారులు స్థలాలు ఎంపికచేసి సొంత భవనాలు, కార్యాలయానికి కావాల్సిన వసతులు కల్పిస్తారు. కొడంగల్‌ అగ్నిమాపక కేంద్రం స్థితిగతులపై ‘న్యూస్‌టుడే’ కథనం.
ఆరేళ్లు గడిచినా సొంత భవనం కరవే..: కొడంగల్‌లో 4 ఆగస్టు 2018లో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 6 సంవత్సరాలు గడిచినా ఈ కేంద్రానికి సొంత భవనం లేక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు సంవత్సరాల క్రితం కోస్గి రోడ్డులోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం సమీపంలో స్థలం కేటాయించారు. కానీ అక్కడ ఉండేందుకు స్థలం అనువుగా ఉండదని సిబ్బంది తెలపడంతో పనులు నిలిపి వేశారు. 
మార్కెట్‌ యార్డులోనే నెట్టుకొస్తున్నారు: అగ్నిమాపక కేంద్రంలో 24 గంటల పాటు వాహన సేవలు పాటు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. రాత్రి, పగలు తేడా లేకుండా ఎక్కడ ఏం జరిగినా వెంటనే వెళ్లాల్సి వస్తుంది. అలాంటి అత్యవసర సేవలు అందిస్తున్న 12 మంది సిబ్బందికి సరైన కార్యాలయం కాని, వసతులుకాని లేవు. మార్కెట్‌ యార్డ్‌లోని మూడు దుకాణాల్లో ఒకటి కార్యాలయం కోసం, రెండోది సిబ్బంది నిద్రించేందుకు, మూడోది వంట చేసుకోవడానికి వినియోగిస్తున్నారు. ఇక వాహనం కార్యాలయం ముందున్న చెట్ల కింద నిలపాల్సి వస్తుంది. వాహనానికి నీరు లేక ఇతర ప్రాంతం నుంచి తీసుకోవాల్సి వస్తోంది. 

ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం

అగ్నిమాపక కేంద్రానికి ఇంకా స్థలం కేటాయింపు జరగలేదు. కార్యాలయం నిర్మాణానికి, వాహనానికి సంబంధించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఉన్నతాధికారులు తీసకెళ్లారు.

ప్రభాకర్, అగ్నిమాపక కేంద్రం అధికారి, కొడంగల్‌.

కేటాయించిన స్థలం సరిపోక..

అగ్నిమాపక కేంద్రానికి కోస్గి రోడ్డులోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ముందు 800 గజాల స్థలం కేటాయించారు. ఇది సరిపోదు. పైగా మున్సిపల్‌కు చెందిన మురుగు నీరు అంతా కార్యాలయానికి కేటాయించిన ప్రదేశంలో వచ్చి చేరుతుందని సిబ్బంది వాపోతున్నారు. కనీసం 1500 గజాల స్థలం కేటాయిస్తే సరిపోతుందని తహసీల్దార్‌ కార్యాలయంలో పలుమార్లు తెలియజేసినా స్పందించడం లేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని