logo

సమావేశాలే లేవు..సమస్యల పరిష్కారమెలా..?

ప్రజలకు చిన్నపాటి అనారోగ్యం వచ్చినా వెంటనే గుర్తొకొచ్చేది సర్కారు ఆసుపత్రి. వీటిలో సౌకర్యాలు బాగుంటే పేదలే కాదు, ఉన్నతాదాయ వర్గాలు కూడా వస్తారు.

Updated : 21 Jun 2024 06:01 IST

ఉలుకు పలుకు లేని ఆసుపత్రుల అభివృద్ధి కమిటీలు 

వికారాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలు  

ప్రజలకు చిన్నపాటి అనారోగ్యం వచ్చినా వెంటనే గుర్తొకొచ్చేది సర్కారు ఆసుపత్రి. వీటిలో సౌకర్యాలు బాగుంటే పేదలే కాదు, ఉన్నతాదాయ వర్గాలు కూడా వస్తారు. అందుకోసమే ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌డీఎస్‌)లను ఏర్పాటుచేసింది. ఇవి ఆసుపత్రుల బాగోగుల గురించి ప్రతి మూడు నెలలకోసారి సమావేశాలను నిర్వహించాలి. అవసరమైన సదుపాయాలపై చర్చించాలి. కానీ ఈ కమిటీల జాడ ఎక్కడా కనిపించడంలేదు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ గాడి తప్పుతోందనే విమర్శలొస్తున్నాయి. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

ప్రజా ప్రతినిధులే ఛైర్మన్లు

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్, పరిగి: జిల్లా ఆసుపత్రులకు జడ్పీ ఛైర్మన్లు, నియోజక వర్గాల్లో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాలకు ఎమ్మెల్యేలు, పుర ఛైర్మన్లు, పీహెచ్‌సీలకు ఎంపీపీలు ఛైర్మన్లుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీల్లో స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. జడ్పీ ఛైర్మన్లు, ఎంపీపీల పదవీ కాలం కొద్ది రోజుల్లో ముగియనుంది. జిల్లాలో నాలుగు నియోజక వర్గాలకు కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చారు. కనీసం వీరైనా పట్టించుకుంటారా అని  పలువురు సందేహాలు వ్యక్తం చేస్తునారు. సరైన పర్యవేక్షణ లేక సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్నారు. పారిశుద్ధ్యం పట్టించుకోవడంలేదన్నారు. 

  • దోమ, పూడూరు తదితర మండలాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు శిథివాస్థలకు చేరాయి. ఎప్పుడో మండల వ్యవస్థ ఏర్పడినప్పుడు నిర్మించిన భవనాలే నేటికీ కొనసాగుతున్నాయి. 
  • వికారాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోనూ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.  

నిధుల మంజూరేదీ.. 

ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి సరిపడా నిధులు మంజూరు కావడంలేదు. దీంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా నిధుల కొరతతో సమావేశమైనా ఫలితం ఉండదనే భావనతో ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

  • పీహెచ్‌సీలకు ఏటా రెండు పర్యాయాలు కలిపి సుమారు రూ.1.50 లక్షలు నిధులు మంజూరు చేస్తారు. అభివృద్ధి కమిటీ ఆమోదం మేరకు ఈ నిధులు వసతుల కల్పనకు వినియోగిస్తారు.  

తాగునీటి వసతి లేదు.. వార్డులు అపరిశుభ్రం 

వికారాబాద్‌లో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 23 ఉన్నాయి. జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటలో లేక రోగులు అవస్థలు పడుతున్నారు. తాగునీటి వసతి సక్రమంగా లేదు. పలుచోట్ల ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు పనిచేయటం లేదు. ప్రధాన వార్డుల్లో పరిసరాలు అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి.

మందుల కొరత ఎక్కడా లేదు: డాక్టర్‌ పల్వన్‌కుమార్, జిల్లా వైద్యాధికారి, వికారాబాద్‌.

జిల్లాలో దాదాపుగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కారణంగా ఈ ఆరు నెలల పాటు కొన్నిచోట్ల సమావేశాలు జరగలేదు. ఏ ఆసుపత్రిలోనూ మందుల కొరత లేదు. రోగులకు అవసరమైనవి పూర్తి స్థాయిలో ఉన్నాయి. 

జిల్లా వైద్య వ్యవస్థ స్వరూపం 

జిల్లా ఆసుపత్రి: 1, సామాజిక ఆరోగ్య కేంద్రాలు: 3
ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి: 1
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు: 23
బస్తీ దవాఖాలు: 4
అర్బన్‌ దవాఖానాలు: 2

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని