logo

పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలా?

భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు తారతమ్యం ప్రదర్శిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కబ్జాలకు పాల్పడుతున్నవారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

Published : 21 Jun 2024 04:36 IST

గజాలు ఆక్రమించిన పేదలపై కేసులు 
రూ.155 కోట్ల భూమిని మింగిన పెద్దలపై చర్యలు శూన్యం

గాజులరామారం 13 సర్వే నంబరులో ఇటీవల రెవెన్యూ అధికారులు కూల్చిన నిర్మాణాలు 

కుత్బుల్లాపూర్, షాపూర్‌నగర్, న్యూస్‌టుడే: భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు తారతమ్యం ప్రదర్శిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కబ్జాలకు పాల్పడుతున్నవారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎకరాలకు ఎకరాల ప్రభుత్వ భూములను కబళించి ప్లాట్లు చేసి విక్రయిస్తూ రూ.కోట్లకు పడగెత్తుతున్న వారిని వదిలేసి చిన్నాచితకా స్థలాలను కబ్జా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి మమ అనిపించుకుంటున్నారు. కుత్బుల్లాపూర్‌ మండల రెవెన్యూ రికార్డుల ప్రకారం గాజులరామారం 13 సర్వేనంబరులో 5.37 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలి. కాని ఇందులో రూ.155 కోట్ల విలువచేసే 5.17 ఎకరాల భూమిని డబ్బు, పరపతి కలిగిన కొందరు కబ్జా చేసి తమ వెంచర్‌లో కలుపుకొన్నారు. ఆనంతరం ఆ స్థలాన్ని 200-250 చదరపు గజాల చొప్పున ప్లాట్లుచేసి ప్రైవేటు పట్టా సర్వే నంబర్లతో ఒక్కో ప్లాటును రూ.కోటి నుంచి కోటిన్నరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. సంబంధిత దస్తావేజుల ఆధారంగా జీహెచ్‌ఎంసీ వారు నిర్మాణ అనుమతులు జారీచేయడంతో అందులో బహుళ అంతస్తుల మేడలు వెలిశాయి. దీంతో మిగిలిన అర ఎకరం భూమిపై చిన్నాచితకా భూకబ్జాదరుల కన్ను పడింది. ఇందులో గుడి నిర్మాణం చేయగా మిగిలిన సుమారు 500 చదరపు గజాల స్థలంలో ఇటీవల గదులు నిర్మించడానికి సన్నద్ధమయ్యారు. రెవెన్యూ అధికారులు అడ్డుకుని బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. అయితే రూ.155 కోట్ల విలువచేసే 5.17 ఎరాల భూమిని కబళించిన వారిపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.   ఇక్కడ భూకబ్జ్జాలకు పాల్పడిన వ్యక్తులే గాజులరామారం 329లో సుమారు ఎకరం, 12 సర్వేనంబరులో రెండు ఎకరాలు 100 సర్వేనంబరులో 1300 చదరపు గజాల స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్లు చేసి విక్రయించినట్లు ఆరోపణలున్నాయి.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం 

నేను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 13 సర్వేనంబరు ప్రభుత్వ భూమిలో ఎటువంటి ఆక్రమణలు జరగలేదు. కాని గతంలో జరిగిన ఆక్రమణలపై అప్పటి తహసీల్దార్‌ ఆదేశాల మేరకు సంబంధిత భూమిని సర్వే నిర్వహించి కొందరికి ఎన్‌ఓసీలు జారీచేసినట్లు సమాచారం ఉంది. అయితే తాజాగా ఆ సర్వే నివేదికల ఆధారంగా మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తాం. అందులో ఎవరెవరు ఎంత ఆక్రమించారనేదానిపై ఒక నివేదిక రూపొందించి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

రజనీకాంత్, ఆర్‌ఐ కుత్బుల్లాపూర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు