logo

నిలిపి ఉంచిన రైలు బోగీల్లో మంటలు

సికింద్రాబాద్‌ కోచింగ్‌ డిపోకు సంబంధించిన మెయింటెనెన్స్‌ వాషింగ్‌ లైన్‌లో ఉంచిన ప్యాంట్రీ కార్, ఏసీ కోచ్‌ల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Published : 21 Jun 2024 04:38 IST

ప్యాంట్రీకార్‌ కోచ్‌తో పాటు త్రీటైర్‌ ఏసీ కోచ్‌ దగ్ధం

మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది

రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ కోచింగ్‌ డిపోకు సంబంధించిన మెయింటెనెన్స్‌ వాషింగ్‌ లైన్‌లో ఉంచిన ప్యాంట్రీ కార్, ఏసీ కోచ్‌ల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బోగీల్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో సిబ్బంది గుర్తించి అప్రమత్తమయ్యారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఒకవైపు, అక్కడున్న వాషింగ్‌ యార్డ్‌ సిబ్బంది మరోవైపు నుంచి నీటిని చల్లి మంటలను ఆర్పివేశారు. మంటలు ఇతర కోచ్‌లకు వ్యాపించకుండా ఇతర కోచ్‌లను వేరు చేశారు. ఈ ప్రమాదంలో రెండు బోగీలు కాలిపోయాయి.   రైళ్లలో సమస్య ఉత్పన్నమైనప్పుడు ఎమర్జెన్సీగా ఉపయోగించుకునేందుకు ఈ కోచ్‌లు అందుబాటులో ఉంచారు. వాషింగ్‌ లైన్‌ ప్రాంతంలోని లోయర్‌ యార్డ్‌లో ఉన్న ప్యాంట్రీ కారు బోగీతో పాటు పలు బోగీలను అప్పర్‌యార్డ్‌కు తీసుకుని వచ్చి ఉంచారు. ఉదయం 10.30 గంటల సమయంలో అక్కడున్న ప్యాంట్రీ కారు, ఏసీ బోగీలో నుంచి పొగలు రావడం మెయింటెనెన్స్‌ సిబ్బంది   గుర్తించారు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులతో పాటు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.  దక్షిణ మధ్య జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్, ఇతర అధికారులు  ఘటనా స్థలాన్ని సందర్శించారు. అక్కడున్న బోగీలను పరిశీలించారు. సికింద్రాబాద్‌ డివిజన్, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ భరతేష్‌ కుమార్‌జైన్‌ జరిగిన సంఘటనపై జనరల్‌ మేనేజర్‌కు వివరించారు. రైల్వే సెక్యూరిటీ కమిషనర్‌ దెబాస్మితా సీ బెనర్జీ, జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్లు సాయిఈశ్వర్‌గౌడ్, సరస్వత్‌లు పరిశీలించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని