logo

ఆగ్రోస్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం

చింతల్‌లోని ఆగ్రోస్‌ ప్రాంతీయ కార్యాలయంలో ఆగ్నిప్రమాదం సంభవించి ప్రధాన ఫైళ్లు దగ్ధమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 21 Jun 2024 04:45 IST

ఘటన జరిగి మూడు రోజులు.. దగ్ధమైన దస్త్రాలు

ఆగ్రోస్‌ కార్యాలయంలో దగ్ధమవుతున్న  ఫైళ్లు  

కుత్బుల్లాపూర్, న్యూస్‌టుడే: చింతల్‌లోని ఆగ్రోస్‌ ప్రాంతీయ కార్యాలయంలో ఆగ్నిప్రమాదం సంభవించి ప్రధాన ఫైళ్లు దగ్ధమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదం జరిగి నాలుగు రోజులైనా తలుపులు తెరవకపోవడం, పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణ జరపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు ఈనెల 16, 17న సెలవులు కావడంతో ఈ కార్యాలయానికి తాళాలు వేశారు. ఈనెల 18న తిరిగి కార్యాలయానికి వచ్చిన సిబ్బంది ప్రధాన ఫైళ్లు భద్రపరిచే గదిలో అగ్నిప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి జీడిమెట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు రాకపోవడంతో చేసేదిలేక ప్రాంతీయ అధికారి వెంకన్న నేరుగా బుధవారం సాయంత్రం, తిరిగి గురువారం ఉదయం పోలీసుస్టేషన్‌ వెళ్లి ఫిర్యాదు చేసినా స్పందించలేదని తెలుస్తోంది. దీంతో ఆ గది తలుపులు తెరవకుండా తాము మిన్నకున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. కార్యాలయంలో నైట్‌ వాచ్‌మెన్‌గా పనిచేసే వ్యక్తి ఆ రెండు రోజులు సెలవు పెట్టి ఇంటికి వెళ్లిపోవడం, ముఖ్యమైన గదిలోనే అగ్నిప్రమాదం సంభవించి ప్రధాన ఫైళ్లు కాలిపోవడం, కిటికీ తలుపు కింద పడి ఉండటం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వ్యవసాయ యంత్ర పరికరాలు, పురపాలక సంఘాలకు సరఫరాచేసిన డంపర్‌బిన్స్, ట్రాక్టర్‌ ట్రాలీలు, వాటర్‌ ట్యాంకర్లకు సంబంధించి వ్యవహారంలో ఓ అధికారి భారీగా అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఆ ఫైళ్లను దగ్ధం చేసి ఆధారాలు దొరకుండా చేయడం కోసమే గుర్తుతెలియని వ్యక్తులు ఆ గదికి నిప్పుపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయమై ప్రాంతీయ అధికారి వెంకన్న నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ స్కీమ్‌ ఫైళ్లు మాత్రమే కాలిపోయినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని