logo

మత్తులోకి దించి.. నేరాల బాట పట్టించి

బాల్యం గాడి తప్పుతోంది. ఇటీవల నగరంలో వరుస సెల్‌ఫోన్‌ చోరీలు, జేబు దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లో మైనర్ల ప్రమేయం ఉన్నట్టు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.

Updated : 21 Jun 2024 06:04 IST

బాల్యం గాడి తప్పుతోంది. ఇటీవల నగరంలో వరుస సెల్‌ఫోన్‌ చోరీలు, జేబు దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లో మైనర్ల ప్రమేయం ఉన్నట్టు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకొని జువెనైల్‌ హోమ్‌కు తరలించినా బయటకు రాగానే మళ్లీ అదే దారిలో నడుస్తున్నారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఆవేదన వెలిబుచ్చారు. ఈ తరహా కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి కౌన్సెలింగ్‌ కార్యక్రమాలు నిర్వహించేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, చార్మినార్‌

బిర్యానీ.. శీతల పానీయాలతో మొదలై..

ఫలక్‌నుమా పరిధిలో నడచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బాల నేరస్థుడు బురిడీ కొట్టించి జేబులో నగదు కొట్టేశాడు. బహదూర్‌పురలో ఆటోలో ప్రయాణికుల మాదిరిగా ఎక్కి పక్కనే ఉన్న మహిళ చేతిసంచిలోని నగలు చోరీ చేశారు. చాలీచాలని సంపాదనతో బిడ్డల చిరు కోరికలను తీర్చేందుకు తల్లిదండ్రులు వెనుకాడే పరిస్థితి. ఈ నిస్సహాయతను ఆసరా చేసుకున్న అక్కడి పాతనేరస్థులు, రౌడీషీటర్లు పిల్లలకు బిర్యానీ, శీతలపానీయాల వంటి తినుబండారాలతో ఆకట్టుకుంటున్నారు. రౌడీషీటర్ల మధ్య సాగే ఆధిపత్య పోరులో బాలురే ముందు వరుసలో ఉంటున్నారు. దుస్తులు, ద్విచక్రవాహనాల్లో కత్తులు దాచుకొని తిరగటం... ప్రయివేటు పంచాయతీల్లో ముఠా నాయకుడి పక్కన ఉండటాన్ని గొప్పతనంగా భావిస్తున్నారు.

బైక్‌లు. ఖరీదైన సెల్‌ఫోన్లు

రెండోదశలో ఇదే పిల్లలు దొంగలుగా మారుతున్నారు. కరడుగట్టిన దొంగలు, నేరస్థులపై స్థానిక పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు నిఘా ఉంచుతున్నాయి. వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీంతో తెరవెనుక నుంచి కథ నడిపిస్తున్నారు. అంతర్రాష్ట్ర ముఠాలతో చేతులు కలిపి మైనర్లతో సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌లు, మోసాలు చేయిస్తున్నారు. ఇటీవల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సెల్‌ఫోన్‌ కొట్టేస్తున్న ముఠా ఆటకట్టించారు. ఆరుగురు సూడాన్‌ దేశస్థులతో సహా 20 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ ముఠాలు పిల్లలకు కమీషన్, నెలవారీ జీతం అందజేస్తూ ప్రతి నెలా 10-15 సెల్‌ఫోన్లు వారితో చోరీ చేయిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. బహదూర్‌పుర, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట పరిధిలో సుమారు 20 మంది బాలలు ఇళ్లు, దుకాణాల్లో విలువైన వస్తువులను చోరీ చేసి పాతనేరస్థులకు అందజేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని