logo

కరెంటోళ్ల బస్తీబాట

దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలో సోమవారం నుంచి 11కేవీ ఫీడర్ల సమగ్ర సర్వే చేపట్టబోతున్నట్లు ఆ సంస్థ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ తెలిపారు.

Updated : 21 Jun 2024 05:58 IST

పక్షం రోజుల్లో 11కేవీ ఫీడర్ల సమగ్ర సర్వే 
డిస్కం వ్యాప్తంగా నిర్వహణ 

ముషారఫ్‌ ఫరూఖీ 

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలో సోమవారం నుంచి 11కేవీ ఫీడర్ల సమగ్ర సర్వే చేపట్టబోతున్నట్లు ఆ సంస్థ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ తెలిపారు. 21 సర్కిళ్ల పరిధిలోని 5500 ఫీడర్లలో ప్రతి స్తంభం తిరిగి పూర్తి వివరాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన యాప్‌లో నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. ఎస్‌ఈ నుంచి ఆర్టిజన్‌ వరకు క్షేత్రస్థాయిలో బస్తీబాట నిర్వహించనున్నారని తెలిపారు. వినియోగదారులను  కలుసుకుని  సమస్యలను వింటారని తెలిపారు. గురువారం ఆయన ‘ఈనాడు’కు వివరించారు.
సమాచార సేకరణ..  విద్యుత్తు లైన్ల నిర్వహణ ప్రస్తుతం ఏటా రెండు సార్లు మాత్రమే నిర్వహిస్తున్నారు. అందులోనూ చెట్ల కొమ్మలు కొట్టడం, వదులుగా ఉన్న బోల్ట్‌లను బిగించడం వంటి కొన్ని పనులకే పరిమితం అవుతున్నారు. ఎక్కడైనా స్తంభం వంగినా, ఇతరత్రా లోపాలున్నా పట్టించుకోవడం లేదు. సమగ్ర సర్వేతో 11కేవీ లైన్లలో ప్రతి అంశాన్ని పరిశీలించి వివరాలను నమోదు చేస్తారు.  తర్వాత దశల్లో ఎల్‌టీ, 33కేవీ లైన్లలోనూ సర్వే చేస్తామని వివరించారు. 
ఇప్పుడే ఎందుకు? : వానాకాలం మొదలు కావడంతో కరెంట్‌కు గృహాల నుంచి, వ్యవసాయ రంగం నుంచి పెద్దగా డిమాండ్‌ లేదు. నెట్‌వర్క్‌ గురించి అధ్యయనం చేసేందుకు ఈ సమయం అనువుగా భావించాం. సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి 15 రోజుల పాటూ స్తంభాలు, డీటీఆర్‌లు, ఆర్‌ఎంయూల వరకు ప్రతిదీ లెక్కించి, జీపీఎస్‌తో అనుసంధానం చేయనున్నాం. పూర్తి సమాచారం చేతిలో ఉంటే.. దాన్ని బట్టి ప్రాధాన్యాలవారీగా నిర్వహణ ప్రణాళికలు రూపొందించుకునేందుకు దోహదం చేస్తుంది. 
మాన్యువల్‌గా నమోదు: ప్రస్తుతం విద్యుత్తు నెట్‌వర్క్‌ మాన్యువల్‌గా కొనసాగుతోంది. ఎక్కడైనా సమస్య వస్తే సిబ్బంది వారికున్న అనుభవం, పరిజ్ఞానం ఆధారంగా ఫలానా సమస్య అయి ఉండవచ్చని భావించి అక్కడికి వెళ్లి మరమ్మతులు చేస్తున్నారు. కరెంట్‌ పోయిన విషయం వినియోగదారుడు తమకు సమాచారం ఇస్తే తప్ప తెలియడం లేదు. ఇది మారాల్సి ఉంది. అందుకే 11కేవీ ఫీడర్లలో సెన్సర్లను ఏర్పాటు చేయబోతున్నాం.

ఇతర డిస్కమ్‌లలో అధ్యయనం..

విద్యుత్తు సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడం, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు దేశంలోని ఇతర నగరాల్లోని డిస్కమ్‌లను మా అధికారుల బృందం అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం నాలుగు కమిటీలు దిల్లీ, ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు డిస్కమ్‌లను అధ్యయనం చేస్తున్నాయి. నేను కూడా పరిశీలించేందుకు ముంబయి రెండుసార్లు వెళ్లి వచ్చాను. వీటిలోంచి మెరుగైన వాటిని ఇక్కడ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. 
3-ఎం సూత్రాలను ఆచరించేలా.. : మన దగ్గర పనిచేసేందుకు సిబ్బంది (మెన్‌) ఉన్నారు. కావాల్సిన స్తంభాలు, తీగలు(మెటీరియల్‌) ఉన్నాయి. చేయాల్సిందలా సిబ్బంది వెళ్లి నిర్వహణ, మరమ్మతులు చేయడమే (మేనేజ్‌మెంట్‌). ఈ మూడో అంశంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాం.

సర్వే నగరాలు, పట్టణాల్లో ఇలా.. 21 సర్కిల్స్, 50 డివిజన్లు, 134 సబ్‌ డివిజన్లు, 495 సెక్షన్లలో చేయనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని