logo

గ్యాస్‌ ఏజెన్సీ గోల్‌మాల్‌!

కొన్ని గ్యాస్‌ ఏజెన్సీల గోల్‌మాల్‌ వ్యవహారాలు వినియోగదారులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. రీఫిల్‌ సిలిండర్‌ బుక్‌ చేసిన 10 నుంచి 15 రోజులకు గానీ డెలివరీ అవడం లేదు.

Published : 21 Jun 2024 04:55 IST

బుక్‌ చేస్తే రెండు వారాలకు డెలివరీ
డెలివరీ బాయ్‌లతో బ్లాక్‌మార్కెట్‌ దందా

తనిఖీల్లో పౌరసరఫరాలశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న సిలిండర్లు

ఈనాడు, హైదరాబాద్‌: కొన్ని గ్యాస్‌ ఏజెన్సీల గోల్‌మాల్‌ వ్యవహారాలు వినియోగదారులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. రీఫిల్‌ సిలిండర్‌ బుక్‌ చేసిన 10 నుంచి 15 రోజులకు గానీ డెలివరీ అవడం లేదు. దీంతో ఒకే సిలిండర్‌తో నెట్టుకొస్తున్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మరికొందరు ఎలక్ట్రిక్‌ కుక్కర్, చిన్న గ్యాస్‌సిలిండర్‌తో ఆ కాస్త సమయాన్ని వెళ్లదీయాల్సి వస్తోంది. సాధారణంగా బుక్‌ చేసిన 48గంటల్లో సిలిండర్‌ కావాల్సి ఉండగా.. కొన్ని ఏజెన్సీల్లో 15 రోజుల సమయం పడుతోంది. ప్రధానంగా అత్తాపూర్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, అంబర్‌పేట్, బేగంపేట్, సోమాజిగూడ, సికింద్రాబాద్‌ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి.

15 రోజుల సమయం.. నగదు చేసుకుంటున్న ఏజెన్సీలు..

గ్రేటర్‌ పరిధిలో 40 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజూ 90వేల రీఫిల్‌ సిలిండర్లు బుక్‌ అవుతుంటాయి. వీటిని 48 గంటలు.. మరీ తప్పని పరిస్థితుల్లో అయితే 72గంటల్లోగా సిలిండర్‌ డెలివరీ చేయాలన్న నిబంధనలున్నాయి. కానీ ఏజెన్సీల నిర్వాహకులు వీటిని డెలివరీ బాయ్‌లతో బ్లాక్‌మార్కెట్‌ దందాకు పంపి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక వినియోగదారుడు ఏడాదికి 12 సిలిండర్లు వాడుకోవచ్చు. తర్వాత వినియోగాన్ని బట్టి 15 వరకు పెంచే అవకాశం ఉంది. చిన్న కుటుంబాలు, తక్కువగా సిలిండర్లు వాడే వారిని ఎంపిక చేసి గోల్‌మాల్‌ వ్యవహారానికి పాల్పడుతున్నారు. చిన్న కుటుంబం అయితే ఏడాదికి ఆరు సిలిండర్లు, పెద్ద కుటుంబం అయితే 9 నుంచి 10 సిలిండర్లు సరిపోతాయి. ఇలాంటి వారిని ఎంపిక చేసి వారి బుకింగ్‌లకు ఆలస్యంగా స్పందించడం లేదా బుకింగ్‌ రద్దయ్యిందని చెప్పి మరోసారి బుక్‌ చేయాలని కోరుతున్నారు.

పౌరసరఫరాలశాఖ దాడుల్లో వందల సిలిండర్ల స్వాధీనం

వినియోగదారుల ఖాతా నుంచి కోత పెడుతున్న సిలిండర్లు హోటళ్లు, రెస్టారెంట్లు, రీఫిల్లింగ్‌ కేంద్రాలకు తరలిపోతున్నాయి. పౌరసరఫరాలశాఖ, ఎస్‌వోటీ తనిఖీల్లో ఈ విషయం బయటపడుతోంది. ఇటీవల పౌరసరఫరాలశాఖ సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేయగా.. వందల కొద్దీ గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్లు బయటపడ్డాయి. వనస్థలిపురం, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లో ప్రైవేట్‌ గ్యాస్‌ సిలిండర్ల గోదాముల్లో బయటపడ్డాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు